Kcr on Central Budget: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారన్న కేసీఆర్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుందని తెలిపారు. న్యాయ మార్గంలో పరిపాలన సాగాలని శ్లోకాల్లో ఉందని చెప్పారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మమని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా.. అంతా గోల్‌మాల్ గోవిందం అని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆత్మవంచన చేసుకుని.. దేశ ప్రజలను వంచించారన్నారు.
వ్యవసాయానికి ఇచ్చింది శూన్యం
ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో రూ.12,800 కోట్లే కేటాయించారని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. రైతు ఉద్యమంలో 700 మంది చనిపోయినా బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యమన్నారు. బడ్జెట్‌లో సాగు రంగానికి ఉద్దీపనలు లేవని అన్నారు. రైతులకు ఏమీ చేయకపోగా యూరియాపై రాయితీ తగ్గించారన్న కేసీఆర్... ఎరువులపై రూ.35 వేల కోట్లు రాయితీ తగ్గించారని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ రూ.25 వేల కోట్ల కోత విధించారని తెలిపారు.
"కేంద్ర బడ్జెట్ చాలా దారుణంగా ఉంది. బడ్జెట్ సందర్భంగా మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుంది. న్యాయ మార్గంలో పరిపాలన సాగాలని శ్లోకాల్లో ఉంది. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మం. బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా. బడ్జెట్ అంతా గోల్‌మాల్ గోవిందం. నిర్మలాసీతారామన్ ఆత్మవంచన చేసుకున్నారు. నిర్మలా సీతారామన్ దేశ ప్రజలను వంచించారు." - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు..
కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదని కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర విద్యుత్ విధానం చెత్తగా ఉందని విమర్శించారు. కేంద్రం దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు భాజపా దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో మోదీ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గుజరాత్ మోడల్.. లోన లొటారం.. పైన పటారమని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ దిక్కుమాలినతనంగా దరిద్రంగా ఉందన్నారు.
పవిత్ర గంగా నదిలో శవాలు తేలేలా కేంద్రం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్న ఆయన... కరోనా సమయంలో ఆరోగ్యరంగానికి బడ్జెట్ పెంచలేదని అన్నారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్న కేసీఆర్... రూ.లక్షల కోట్లు ముంచిన వాళ్లకు రాయితీలు ఇస్తారన్నారు.
"ప్రపంచ ఆకలి బాధపై ఏటా హంగర్ ఇండెక్స్ వెలువడుతుంది. హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101 స్థానంలో నిలిచింది. నేపాల్, బంగ్లాదేశ్ కంటే అద్వాన్న స్థితిలో భారత్ ఉంది. బడ్జెట్‌లో ఆహార రాయితీలు కూడా తగ్గించారు. బడ్జెట్‌లో పంటల మద్దతు ధరల ప్రస్తావన లేదు. కేంద్ర బడ్జెట్‌తో ఎవరిని ఉద్దరించారు. ఎల్‌ఐసీని అమ్ముతామని నిస్సిగ్గుగా చెబుతున్నారు. లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారు. అమెరికా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా?". - కేసీఆర్, తెలంగాణ సీఎం
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:
Union budget 2022: నవ భారత్ కోసం 'బూస్టర్ డోస్' బడ్జెట్!