CM Jagan Vijayawada Tour: ఈ నెల 27న(బుధవారం) విజయవాడ, మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. అదేరోజు సాయంత్రం 5.10 గంటలకు విజయవాడ 1 టౌన్ వించిపేటలో షాజహుర్ ముసాఫిర్ ఖానా, ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో భేటీ అవుతారు. ఆ తరువాత ఇంధిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇఫ్తార్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. రాత్రి 7.35 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో గుంటూరు జడ్పీ ఛైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు తాడేపల్లిలో తన నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వాధికారులు సీఎం టూర్ సమాచారాన్ని ఇచ్చారు.
నేడు హైకోర్టు సీజేతో జగన్ భేటీ: ముఖ్యమంత్రి జగన్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో నేడు భేటీ కానున్నారు. విజయవాడలోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్‌లో సాయంత్రం 6.30 గంటలకు ఇరువురూ సమావేశం కానున్నారు. సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇతర వేడుకల్లో ఇరువురూ కలిసినా.. తొలిసారిగా ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల 27న పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ:వచ్చే ఎన్నికలే ఎజెండాగా వైకాపా కీలక సమావేశం ఈ నెల 27న జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. పార్టీలో వర్గ రాజకీయాలు, ఈ మధ్య కాలంలో పలువురు నాయకులు చేసిన బలప్రదర్శన తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి. మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ, పార్టీ పదవుల పంపకాల నేపథ్యంలో పలువురు నాయకుల నుంచి అసంతృప్తి బహిర్గతమైంది. ఇలాంటి వాటిని మొదట్లోనే నిలువరించి పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశంగా చెబుతున్నారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడంపైనే ప్రధానంగా సీఎం స్పష్టమైన కార్యాచరణ ఇవ్వనున్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయమే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రారంభమైన వాలంటీర్ల సన్మాన కార్యక్రమం నెలాఖరు వరకు జరగనుంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఎలా జరిగింది? మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు ఎలా భాగస్వాములయ్యారనే విషయమై సీఎం ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. సమావేశంలో నియోజకవర్గాల వారీగా సీఎం సమీక్షించే అవకాశం ఉంది. మే 2 నుంచి గడప గడపకూ వైకాపా తొలి విడత కార్యక్రమం మొదలు కానుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతోపాటు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని పార్టీ ఇప్పటికే ఆదేశించింది.
ఇదీ చదవండి:
జగన్ పాలనలో.. పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం: సోము వీర్రాజు