గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సంబంధిత మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణం కోసం రూ.13,105 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సీఎం వివరించారు. ఈ ఏడాది 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్‌ను ఇళ్ల నిర్మాణం కోసం వినియోగించాలన్నారు. కోర్టు వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై వెంటనే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కేసుల పరిష్కారం ఆలస్యమయ్యేట్టు ఉంటే ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని.., ఇందులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కోర్టు వివాదాలు పరిష్కారం కావటంతో విశాఖలో 1.43 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే జూన్ నాటికి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దాదాపు 63 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. భూమిని చదును చేయటంతోపాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీళ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్లలో వినియోగించే బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు నాణ్యతతో ఉండాలన్నారు. నాణ్యత లేని పరికరాలు కొంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని అధికారులను సీఎం హెచ్చరించారు.
పేదల ఇళ్ల నిర్మాణంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న ప్రజాప్రతినిధులను సత్కరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మండలానికి ఒక సర్పంచ్‌ను, మున్సిపాల్టీకి ఒక కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి తాగునీరు, డ్రైనేజీ, కరెంటు లాంటి కనీస మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. తర్వాత కాలనీలకు కావాల్సిన సామాజిక, మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కాలనీల్లో సమగ్ర ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపైనా సీఎం సమీక్షించారు. ఇప్పటివరకు పథకాన్ని 10.2 లక్షల మంది వినియోగించుకున్నారని..,6.15 లక్షల మందికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన వారికీ వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. టిడ్కో ఇళ్లు అత్యంత పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం మార్గదర్శకాలు తయారుచేయాలన్నారు.
ఎంఐజీ ప్లాట్ల పథకంపైనా సీఎం జగన్ సమీక్షించారు. పట్టణాలు, నగరాలు ఉన్న 116 నియోజకవర్గాల్లో ఎంఐజీ ప్లాట్ల పథకానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఎంఐజీ ఇళ్ల పథకం కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో 4127.5 ఎకరాల భూములను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వివాదాలు, చిక్కులు లేని విధంగా క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకు ఈ ప్లాట్లు ఇస్తామని సీఎం తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం లే అవుట్‌లో అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇతర లే అవుట్లకు మార్గదర్శకంగా ప్రభుత్వ ఎంఐజీ లేవుట్ ఉండాలన్నారు. సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి, జోగి రమేశ్, సీఎస్ సమీర్ శర్మ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అవినీతి ఉన్నమాట నిజమే.. అరికడతాం : మంత్రి