‘‘న్యాయస్థానాల్లో అగ్రిగోల్డ్ వ్యవహారం కొలిక్కిరాగానే.. వారికి సంబంధించిన భూములు, ఆస్తులు విక్రయించి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు తీసుకుంటాం. మిగతా సొమ్ము బాధితులకు చెల్లించేలా న్యాయపరంగా అడుగులు వేస్తాం’’ అని సీఎం జగన్ అన్నారు. ఒక ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చెల్లించటం దేశంలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. పేదలు నష్టపోకూడదనే.. మానవత్వంతో అగ్రిగోల్డ్ బాధితులకు సొమ్ము చెల్లిస్తున్నామన్నారు. రూ. 20 వేల లోపు డిపాజిట్టు చేసిన వారిలో సుమారు 7 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 666.84 కోట్లు చెల్లించే కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. మీటనొక్కి బాధితుల ఖాతాలకు ఆ సొమ్ము జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకూ రెండు విడతల్లో 10.40 లక్షల మందికి రూ.905.57 కోట్ల మేర చెల్లించామని వివరించారు.
తాను ఇచ్చిన మాట ప్రకారం రూ. 20 వేల లోపు డిపాజిట్టు చేసిన బాధితులందరికీ చెల్లింపులు జరిపామని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..
గత ప్రభుత్వంలోని మనుషుల కోసం జరిగిన కుంభకోణం
* ‘‘అగ్రిగోల్డ్ కుంభకోణం గత ప్రభుత్వం చేత, గత ప్రభుత్వం వల్ల, గత ప్రభుత్వంలోని మనుషుల కోసం జరిగిందని తేటతెల్లమైంది. వారు ఆ సంస్థ ఆస్తుల్ని ఎలా కొట్టేయాలనుకున్నారో సాక్ష్యాధారాలతో సహా గతంలో అసెంబ్లీలో చెప్పాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు, ఎంత నష్టపోయారు? అనే అంశాలపై మాత్రమే దృష్టిసారించాం.
* వడ్డీ కోసం బడుగులు అగ్రిగోల్డ్‌లో డిపాజిట్టు చేశారు. వారందర్నీ ఆదుకుంటామని చెప్పిన గత ప్రభుత్వం వారిని మోసం చేసి గాలికొదిలేసింది. వారిని ఆదుకోవాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా నిలదీశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నవంబరులో రూ.10 వేల లోపు డిపాజిట్టు చేసిన 3.40 లక్షల మందికి రూ.238.73 కోట్లు చెల్లించాం. ఆపై రూ.10 వేల లోపు దాచుకున్న మరో 3.86 లక్షల మందిని గుర్తించాం. వారికి ఇప్పుడు రూ.207.61 కోట్లు, రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్టు చేసిన 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు చెల్లిస్తున్నాం.
* గత ప్రభుత్వం అరకొర లెక్కల ద్వారా రూ.20 వేల లోపు డిపాజిట్టు చేసిన బాధితుల సంఖ్యను 8.79 లక్షల మందిగా, వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.785 కోట్లుగా తేల్చింది. ప్రజల్ని మోసం చేస్తూ కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే జీవో నెంబర్ 31 ఇచ్చింది. అయినా ఒక్క రూపాయి కూడా బాధితులకు చెల్లించలేదు’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
దేశంలోనే చరిత్రాత్మకం: హోంమంత్రి సుచరిత
* ఆర్థిక నేరాల బారిన పడిన బాధితులకు మన రాష్ట్ర ప్రభుత్వ సాయం చేయటమనేది దేశంలోనే చరిత్రాత్మకం అని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
* వాచ్ మెకానిక్‌గా పనిచేసే తాను అయిదేళ్ల కిందట అగ్రిగోల్డ్‌లో రూ.18,450 కట్టానని.. ఆ డబ్బు ఇప్పుడు రావటం ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితుడు చంద్రశేఖర్‌రావు చెప్పారు.
* అగ్రిగోల్డ్‌లో కట్టిన రూ.15 వేల కోసం ఏళ్లపాటు తిరిగానని ఇప్పుడు తనకు న్యాయం జరిగిందని గుంటూరు జిల్లా మాచర్ల మండలానికి చెందిన బాధితురాలు బొప్పూడి ఉషారాణి పేర్కొన్నారు.
ఇదీ చదవండి
sc commission at guntur : రమ్య హత్య కేసును తీవ్రంగా పరిగణిస్తున్నాం: జాతీయ ఎస్సీ కమిషన్