వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమల్లో భాగంగా ఖరీఫ్ నుంచి ప్రతి రైతు దగ్గర రూ.10 చొప్పున తీసుకుని సంతకం చేసిన రశీదు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘ఆర్‌బీకేల్లో ప్రదర్శించిన ధరలు దక్కకపోతే అక్కడి రైతులు.. వ్యవసాయ సహాయకుడి ద్వారా సీఎం యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. దీంతో మార్కెటింగ్ శాఖ, సంయుక్త కలెక్టర్ జోక్యం చేసుకుని రైతుకు తోడుగా నిలుస్తారు. కనీస గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’ అని చెప్పారు. 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన 5.97 లక్షల మంది రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.542 కోట్ల పెట్టుబడి రాయితీని ఆయన మంగళవారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. 1,220 సీహెచ్‌సీలకు సంబంధించి ఆయా సంఘాలకు రాయితీగా రూ.29.51 కోట్లు, 2020 ఖరీఫ్ పంటల బీమాకు సంబంధించిన పెండింగ్ మొత్తం రూ.93 కోట్లనూ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ-పంట సమాచారం ఆధారంగా గ్రామస్థాయిలోని ఆర్‌బీకేల్లో జాబితా ప్రదర్శించి పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. కౌలు రైతులతో సహా అందరికీ అందేలా చూస్తున్నాం. ఎవరి పేరైనా జాబితాలో లేకపోతే మళ్లీ నమోదు చేసుకోవచ్చు’ అని చెప్పారు. ‘తెదేపా హయాంలో 2015లో కురిసిన వర్షాలకు, 2018 ఖరీఫ్‌లో కరవుతో నష్టపోయిన రైతులకు పరిహారం ఎగ్గొట్టారు’ అని విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయశాఖను మూసేస్తే.. తిరిగి తెరిచిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే అని రైతులు గుర్తించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి