‘నా మంత్రివర్గాన్ని మార్చుకుంటున్నా.. ఈ నెల 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించండి’ అని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్ కోరినట్లు తెలిసింది. బుధవారం సీఎం జగన్.. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మంత్రిమండలి మార్పులు చేర్పులపై నివేదించారు. ప్రస్తుత మంత్రుల్లో ఎంత మందిని మారుస్తున్నదీ వివరించారు. గురువారం జరిగే మంత్రిమండలి సమావేశం తర్వాత ఆయా మంత్రుల రాజీనామా కోరనున్నట్లు గవర్నర్‌కు సీఎం తెలిపి.. ఆ మేరకు మంత్రుల రాజీనామాలను ఆమోదించాలని కోరినట్లు తెలిసింది.
తర్వాత కొత్తగా మంత్రిమండలిలోకి తీసుకుంటున్న వారి జాబితాను సమర్పిస్తామని.. వాటిని ఆమోదించి వారితో 11న ప్రమాణ స్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత సీఎం.. గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి కావడంతో కొత్త జిల్లాల వివరాలనూ జగన్ వివరించినట్లు తెలిసింది. అరగంటకుపైగా సాగిన ఈ భేటీలో ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: ప్రభుత్వానికి ఆదాయార్జన ఎంత కష్టమో అందరికీ తెలుసు: మంత్రి బుగ్గన