రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నా.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మౌలిక సౌకర్యాలు, గృహ నిర్మాణం, విద్య తదితర అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి(cm jagan) అభిప్రాయపడ్డారు. కౌలు రైతులకు రుణాలు అందించడంపై దృష్టి సారించాలని కోరారు. 2021-22 సంవత్సరానికి రూ.2.83 లక్షల కోట్ల రుణ పంపిణీ లక్ష్యంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) రూపొందించిన వార్షిక ప్రణాళికను సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. గతేడాది ప్రాధాన్య రంగాలకు 105%, వ్యవసాయ రంగంలో 114.6% రుణ లక్ష్యాలను సాధించారని.. ఈ వృద్ధి సాధనలో బ్యాంకుల పాత్ర మరువలేనిదని ప్రశంసించారు. కొవిడ్ కారణంగా తలెత్తిన అనూహ్య పరిస్థితులు, వైరస్ ఉద్ధృతిని తట్టుకోవడానికి కర్ఫ్యూ విధింపు తదితర చర్యలతో రాష్ట్రంపై ఆర్థికంగా పెనుభారం పడిందని వివరించారు.
మహానగరాలు లేని ఆంధ్రప్రదేశ్
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడంతో.. అత్యుత్తమ వైద్యం కోసం తరలివెళ్లాల్సిన పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ‘ప్రస్తుతం ఉన్న మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో క్లినిక్కుల నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాసుపత్రుల అభివృద్ధిని చేపట్టాం. 16 కొత్త వైద్య కళాశాలలను తీసుకొస్తున్నాం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఒక బోధనాసుపత్రి ఏర్పాటు దిశగా అడుగేస్తున్నాం. గ్రామస్థాయిలో 2వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశాం. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు.
బ్యాంకుల సహకారం కావాలి
'రాష్ట్రంలో కొత్తగా 17 వేల గ్రీన్‌ఫీల్డ్ కాలనీల ఏర్పాటు ద్వారా 28.30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నాం. ఈ ఏడాది 15.60 లక్షలకు పైగా ఇళ్లను నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది 12.08 లక్షల ఇళ్లను నిర్మిస్తాం. వీటిలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు రాబోయే మూడేళ్లలో రూ.34వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఇందుకు బ్యాంకుల సహకారం కావాలి' అని సీఎం కోరారు. ఎంఎస్‌ఎంఈల కోసం రీస్టార్ట్, నవోదయ కార్యక్రమాలతో రుణాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో సేవలపై దృష్టి పెట్టాలి
రైతు భరోసా కేంద్రాల్లో సేవలు అందించడంపై బ్యాంకు శాఖలు దృష్టి పెట్టాలని వర్చువల్ ద్వారా సమావేశంలో పాల్గొన్న యూనియన్ బ్యాంకు సీఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ సూచించారు. కౌలు రైతులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని కోరారు. రంగాల వారీగా కేటాయింపులపై వార్షిక రుణ ప్రణాళికలోని అంశాలను ఆయన వివరించారు. టీకాలు వేయడంలో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
బ్యాంకింగ్ రంగానికి మంచి వాతావరణం సృష్టించిన సీఎం
'మూడేళ్ల కిందట బ్యాంకు శాఖల ముందు ధర్నాలు జరిగేవి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకింగ్ రంగానికి మంచి వాతావరణం సృష్టించారు. రైతు భరోసా, సకాలంలో బీమా పరిహారం, చేయూత, ఆసరా పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో బ్యాంకర్లకు ఒత్తిడి తగ్గింది. వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యవసాయం, గృహనిర్మాణ కాలనీల విషయంలో సీఎం తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయం.'- బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ
ఇదీచదవండి