ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద పేదలకు ఇళ్లు నిర్మించే కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రహదారులు, విద్యుత్తు, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ వంటి సదుపాయాలకు అయ్యే వ్యయాన్ని భరించాలని కోరుతూ ప్రధానికి మంగళవారం ఆయన లేఖ రాశారు. మౌలిక వసతుల కల్పన పీఎంఏవైలో భాగం చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖల్ని ఆదేశాలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ‘ప్రస్తుతం పీఎంఏవై అర్బన్, గ్రామీణ్ కింద పేదలకు ఇళ్లు నిర్మించే కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేశారు. అంత భారీ వ్యయాన్ని భరించడం చాలా కష్టం. గృహ ప్రవేశానికి ఇళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కాలనీల్లో మౌలిక వసతులు లేకపోతే లబ్ధిదారులు వాటిలోకి వెళ్లలేరు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం మేం చేసిన భారీ ఖర్చు, పీఎంఏవై కింద కేంద్రం అందించే సాయం సంపూర్ణ ఫలితాలనివ్వదు’ అని పేర్కొన్నారు. ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు, 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆ లేఖలో ముఖ్యమంత్రి వివరించారు.
మౌలిక వసతులకే రూ.34,109 కోట్లు కావాలి...
కేంద్రం నిర్దేశించిన ‘అందరికీ ఇళ్లు’ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ... ఏపీ ప్రభుత్వం 30.76 లక్షల మంది లబ్ధిదారులకు సొంత ఇళ్ల పట్టాల కోసం రూ.23,535 కోట్ల అంచనా వ్యయంతో 68,381 ఎకరాలు సేకరించాం. ఒక్కో లబ్ధిదారుకు పట్టణాల్లో ఒక సెంటు, గ్రామాలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో 1.5 సెంటు చొప్పున 17,005 గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాం. ఆ స్థలాల్లో పీఎంఏవై గ్రామీణ్, అర్బన్ పథకాల కింద రూ.50,944 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల పక్కా గృహాల నిర్మాణానికి లబ్ధిదారులకు సాయం అందిస్తున్నాం. అయితే ఈ కాలనీల్లో కనీస మౌలిక వసతులు కల్పించకుండా పీఎంఏవై లక్ష్యం నెరవేరదు. అన్ని వేల కాలనీల్లో, అంత భారీ ఎత్తున మౌలిక వసతులు కల్పించేందుకు రూ.34,109 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అంత భారీ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదు. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.23,535 కోట్లు వెచ్చించిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నా’ అని సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ మూడూ కీలకం..
‘కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎంఏవై ప్రపంచంలోనే గొప్ప సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి. గడిచిన ఏడేళ్లలో 308.2 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. రూ.2.99 లక్షల కోట్ల సాయం అందించింది. ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయం సాధించాలన్నా, పౌరుల సమగ్రాభివృద్ధి లక్ష్యం నెరవేరాలన్నా... మూడు అంశాలు కీలకం. అవి. 1. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం. 2. ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులకు సహాయం అందించడం. 3. ఆ కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పించడం’ అని సీఎం పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
Covid Third Wave: పిల్లల కోసం.. ఒక్కోటి 180 కోట్లతో 3 ఆసుపత్రులు: సీఎం జగన్