ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. ప్రత్యేక హోదా, విభజన బిల్లులోని అంశాలు అమలు, రాష్ట్రానికి రెవిన్యూ లోటు భర్తీపై ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం మరింత సాయం అందించాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు సత్వరమే విడుదల చేయాలని సీఎం అడగనున్నారు.
రాజకీయ భేటీ..!
రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఆర్థిక సహకారం అందించాలని ప్రధానికి వినతి పత్రం అందించనున్నట్లు సమాచారం. ఎన్డీఏలో వైకాపా చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవలె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య సీఎం జగన్ దిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై మంగళవారం దిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సీఎం పాల్గొని రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై తన వాదన వినిపించే అవకాశం ఉంది.
సీఎం పర్యటన షెడ్యూల్
సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు వెళ్తారు. 10.30 గంటలకు కడప నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందుల చేరుకుంటారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు తన మామ గంగిరెడ్డి కర్మలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం 3.25 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో అధికారులతో కలిసి నేరుగా దిల్లీ వెళ్తారు. సాయంత్రం 5.55 గంటలకు దిల్లీ చేరుకుని అక్కడి నుంచి ఒకటో జనపథ్‌కు చేరుకుంటారు. సోమవారం రాత్రి దిల్లీలోనే బస చేసి మరుసటి రోజున ప్రధానితో భేటీ అవుతారు.
ఇదీ చదవండి: దూకుడుగా ఆడుతోన్న కోల్‌కతా.. గిల్ బౌండరీ