భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో అవసరమైన చోట సహాయ, పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. శిబిరాల్లో ఉన్నవారికి మంచి ఆహారం అందించాలని చెప్పారు. బాధితులకు రూ.1000 చొప్పున తక్షణ సాయం అందించాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం గురువారం వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని వెంటనే తరలించాలి. బాధితుల కోసం ప్రత్యేకంగా ఒక ఫోన్ నంబరు అందుబాటులో ఉంచాలి. ఆహారం, తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేయాలి. ప్రాథమిక, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలి. విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే యుద్ధప్రాతిపదికన వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రిజర్వాయర్లు, చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి. రోడ్లు, ఇతరత్రా మౌలిక సదుపాయాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలి. ఫోన్ కాల్‌కు మేం అందుబాటులో ఉంటాం. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయాలి’ అని సీఎం అన్నారు.
తమిళనాడు సరిహద్దుల్లో మరింత జాగ్రత్త
తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ‘తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ. కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నెల్లూరుకు, మరో 2 బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయి. కర్నూలులో మరో 2 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మంగళగిరిలోనూ అదనపు బృందాలను సిద్ధం చేశాం. అవసరమైతే వీరి సేవలను వినియోగించుకోవాలి’ అని ఆదేశించారు.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
గురువారం సాయంత్రం చెన్నై వద్ద వాయుగుండం తీరం దాటిందని, ఈ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్రలో తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఈ నెల 17న ఇది తీరం దాటే అవకాశాలున్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి