విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం, దేశ సంరక్షనార్థం చతుర్వేద హవనం నిర్వహించారు. ఐదు రోజులపాటు కొండపైన చిన్నరాజ గోపురము వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆలయ పాలకమండలి చైర్మన్ తెలిపారు. చతుర్వేద హవనాన్ని ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, చింతపల్లి ఆంజనేయ ఘనపాటి, ప్రధానార్చకులు లింగంబోట్ల దుర్గాప్రసాద్ తదితరులు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి కర్ణాటకలోని హంపి పీఠాధిపతులు విరూపాక్ష స్వామీజీ హాజరయ్యారు. చతుర్వేద హవనంలో భాగముగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచానము, పంచగవ్య ప్రాసన, రుత్విక్ వరుణ, గోపూజ, యాగశాల ప్రవేశం, చతుర్వేద మండపారాధన, బ్రహ్మకలశ స్థాపన, అఖండ దీప ప్రజ్వలన, అగ్నిప్రతిష్టాపన, చతుర్వేద పారాయణ, వాస్తు, యోగిని, క్షేత్రపాలక, నవగ్రహ మంటపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో సురేశ్ బాబు, పాలకమండలి సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు