రైతు సమస్యలపై ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు నిధులు పెంచాలని, రైతుభరోసా కింద 15వేల ఇవ్వడంతోపాటు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సహకార డైరీలను ధారాదత్తం చేసే విధానాలు మానుకోవాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్ల బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రైతుభరోసా కేంద్రాలను వైకాపా కార్యకర్తల నిలయాలుగా మార్చడం వల్ల.. పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. 70శాతం మంది ఈ-క్రాప్ బుకింగ్ నిర్లక్ష్యంతో నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. 18 వందల 88ఉన్న క్వింటా ధాన్యాన్ని 1300నుంచి 1400కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని.. పెండింగ్ ధాన్యం బకాయిల్ని ఇంతవరకూ చెల్లించలేదని మండిపడ్డారు. బకాయిలు ఇవ్వకుండా, పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తే రైతుల కడుపు నిండదన్నారు.
పంటల బీమా ప్రీమియం చెల్లింపుపై అసెంబ్లీలో అసత్యాలు..
గత ఏడాది నుంచి వరుసగా ఏడు విపత్తులు రావటంతో 37లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి, 15వేల కోట్ల మేర రైతులు నష్టపోయారని చంద్రబాబు అన్నారు. 58 లక్షల మందికి ఇవ్వాల్సిన పరిహారాన్ని 26 లక్షల మందికి కుదించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటల బీమా ప్రీమియం చెల్లింపుపై అసెంబ్లీలో అసత్యాలు చెప్పి, తెలుగుదేశం నిలదీయడంతో అదేరోజు రాత్రి 590 కోట్ల ప్రీమియం చెల్లిస్తూ జీవో విడుదల చేశారన్నారు. నివర్ తుపానుతో 17.33 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగితే.. 5 లక్షల ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారని విమర్శించారు. విపత్తు నిర్వహణ శాఖ ఎకరాకు 15వేలు లెక్కిస్తే, వైకాపా ప్రభుత్వం కేవలం 4వేలు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రతిపక్షంలో ఎకరాకు 30వేల పరిహారం డిమాండ్ చేసిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు మాత్రం కంటితుడుపు చర్యలతో సరిపెట్టారని మండిపడ్డారు.
సున్నా వడ్డీ రుణాన్ని 3 లక్షల నుంచి ఒక లక్షకు కుదించారన్నారు. బ్యాంకులకు ముందే వడ్డీ చెల్లించాలన్న షరతుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 64 లక్షల మంది రైతులకు 4వేల కోట్ల సున్నావడ్డీ ఇస్తామని హమీ ఇచ్చి, 14.58 లక్షల మందికి 510 కోట్లు మాత్రమే చెల్లించారని ఆక్షేపించారు. రాయలసీమలో రాయితీపై అందించే తుంపర సేద్య పరికరాలను ఆపేశారని, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు హామీలు విస్మరించారని దుయ్యబట్టారు.
రైతుభరోసా సాయాన్ని కుదించారు..
తెలుగుదేశం ఐదేళ్ల పాలనలో పంట నష్టపోయిన రైతులకు 4 వేల 7కోట్ల బీమా చెల్లించామని చంద్రబాబు తెలిపారు. రైతు రుణమాఫీ కింద 15 వేల 279 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. రైతుభరోసా కింద రాష్ట్ర నిధులు 13 వేల 500ఇస్తామన్న జగన్‌రెడ్డి.. మూడు దఫాలుగా 7 వేల 500 మాత్రమే ఇసున్నారని విమర్శించారు. దీనివల్ల రైతులు ఏటా 6వేలు చొప్పున ఐదేళ్లలో 30వేలు నష్టపోతున్నారన్నారు. 15లక్షల మంది కౌలు రైతులకు ఇవ్వాల్సిన రైతుభరోసా సాయాన్ని 41 వేలకు కుదించారన్న చంద్రబాబు.. రైతులకు కులం ఆపాదించడం దుర్మార్గమన్నారు.
KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగు.. కన్సల్టెంట్ నియామకానికి నోటిఫికేషన్