నిర్మాణంలో ఉన్న రాజధానికి డబ్బులివ్వమని అడిగితే ఇస్తారు.. కానీ మరో రాజధానికి డబ్బులు అడగటానికి ప్రభుత్వానికి విజ్ఞత ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన 2,500 కోట్లను విధ్వంసం చేసేశాం.. ఇప్పుడు మరో రాజధానిని కడతాం.. దానికి నిధులివ్వమని కోరటం తుగ్లక్ చర్య కదా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందనేది తన అభిప్రాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలోని నిర్మాణాలను గ్రాఫిక్స్ అని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు... ఇప్పుడు ఆ భవనాల్ని అమ్ముతామని ఎలా అంటారని ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చిందని, వాటితో భవన నిర్మాణాలు పూర్తయ్యాయని.. ఈ సందర్భంలో రాజధానిని ఎలా మారుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై సీనియర్ పాత్రికేయుడు శేఖర్ గుప్తా, మోహన్‌దాస్‌పై తదితరులు చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు.
అమరావతి ప్రాంతం రాష్ట్రానికి సమాన దూరంలో ఉందన్న చంద్రబాబు నగరానికి అటు వైపు ఆరు జిల్లాలు, ఇటువైపు ఆరు జిల్లాలు ఉన్నాయన్నారు. ఓ వైపు 2.35 కోట్ల మంది, మరోవైపు 2.15 కోట్ల మంది జనాభా ఉన్నారని తెలిపారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు చేరువలో అమరావతి ఉండటంతో పాటు అన్ని విధాల అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతమని గుర్తు చేశారు. ఐదు జాతీయ రహదారులుతో అనుసంధానాన్ని ప్రస్తావించారు. విశాఖపట్నం, తిరుపతిలను కూడా పెద్ద నగరాలుగా తీర్చిదిద్దాలనుకున్నామన్న చంద్రబాబు అదనంగా 14 స్మార్ట్ నగరాలను నిర్మించాలనుకున్నామని పేర్కొన్నారు.
అత్యధిక కొవిడ్ కేసుల విషయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ ఎలా పోటీ పడుతుందో.. భవిష్యత్తులో అమరావతిని విధ్వంసం చేసేసి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసే విషయంలోనూ అలాగే పోటీపడుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్యం, సమష్టి పోరాటం ద్వారా దీన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమరావతికి మొదటి దశలో 52,847 కోట్లతో 62 ప్రాజెక్టులు ప్రారంభించగా 41,678 కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయని చంద్రబాబు వివరించారు.
ఇదీ చదవండి: స్వాతంత్య్ర దినోత్సవం.. ప్రభుత్వ భవనాలకు విద్యుద్దీపోత్సవం