రేపు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌ల వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో తెదేపా శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే..పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.16, డీజిల్‌పై రూ.17 తగ్గించాలన్నారు. అనేక రాష్ట్రాలు పన్నులు తగ్గించినా.. వైకాపా ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జగన్ అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో చమురు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని చంద్రబాబు హెచ్చరించారు. అధిక డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతినటంతో పాటు ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారన్నారు. లారీల యజమానాలు, కార్మికులు ఆర్థికంగా దెబ్బతినడమే కాక..రవాణ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రో భారాలకు జగన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ, దుబారాలే కారణమని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే అధికంగా పెట్రోలు రూ.110.98 చేరటంతో పాటు కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రో భారం పిడుగుపాటుగా మారిందని ఆక్షేపించారు.
ఇదీ చదవండి
Minister Buggana:'పెట్రో ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా నిర్ణయం తీసుకోలేం'