CBN: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధిత కుటుంబాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం రాష్ట్రానికే అవమానమన్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ నేను సిగ్గుపడుతున్నానని అన్నారు. అత్యాచారం చేసిన శ్రీకాంత్, బాబురావు, పవన్ కల్యాణ్‌కు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలి తండ్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు పట్టించుకోకపోగా.. కుమార్తెను వెతుక్కోవాలని తండ్రికి చెప్పడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఉందా అని సీఎంను ప్రశ్నించారు. సీఎం ఒంగోలుకు కాదు వెళ్లాల్సింది... ఇక్కడకు రావాలన్నారు. ఏపీలో దిశ చట్టం లేదు..దిశ యాప్ లేదు. కేవలం లేనిదాన్ని ఉందని చెప్పుకొని సీఎం తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ప్రవర్తన వల్ల సంఘ విద్రోహులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డల విలువ ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు. మరో రాష్ట్రం నుంచి వచ్చిన అమ్మాయిని పల్నాడులో అత్యాచారం చేశారు.. సీఎం కాన్వాయ్ కోసం కారు డ్రైవర్‌ను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానిది అహంకారమా? ఉన్మాదమా? అని ప్రశ్నించారు. సీఎం తన చెంచాలతో మాట్లాడిస్తే భయపడమని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకపోవడంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేేశారు. ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ప్రభుత్వానిది అహంకారమా.. ఉన్మాదమా?
‘ఓ యువతిని కాబోయే భర్త ముందే మానభంగం చేస్తే.. నిందితులను పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం ఇది. మీకు శీలం విలువ తెలియడం లేదు. ఆడబిడ్డల విలువ తెలియడం లేదు. కుటుంబంతో కలిసి కారులో తిరుపతికి వెళుతుంటే మధ్యలో వారి కారును ముఖ్యమంత్రి కాన్వాయ్‌కు కావాలని తీసుకుపోతారా? ఇది అహంకారమా లేక ఉన్మాదమా? వీటన్నింటికీ ముఖ్యమంత్రి సమాధానం చెప్పి తీరాలి. ’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
తెదేపా తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం
తెదేపా తరఫున బాధితురాలికి రూ.5 లక్షలు సాయం అందజేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. బాధితురాలు గౌరవప్రదంగా తిరిగి జీవనం సాగించేందుకు ఆమెకు రూ.కోటి ఆర్థిక సాయం, ఒక ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చంద్రబాబు, బొండా ఉమలకు మహిళా కమిషన్ నోటీసులు
విజయవాడలోని ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ ప్రతిపక్షనేత చంద్రబాబు, తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: Rape Incident: విజయవాడ అత్యాచార ఘటన.. నున్న సీఐ, ఎస్ఐలు సస్పెన్షన్