కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలక్షణమైన నటనతో పునీత్ లక్షలాది అభిమానులను సంపాదించుకున్నారన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు చిన్నవయస్సులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గొప్ప స్నేహితుడిని కోల్పోయాను: బాలకృష్ణ
పునీత్ రాజ్ కుమార్ మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయానని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కన్నడ చిత్ర పరిశ్రమకు అప్పు మృతి తీరని లోటు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి హీరోగా, గాయకుడిగా, టీవీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి." అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చిన్న వయసులోనే గొప్ప నటుడిని కోల్పోయాం: లోకేశ్
పునీత్ రాజ్ కుమార్ మృతిపట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం ప్రకటించారు. చిన్న వయసులోనే గొప్ప నటుడిని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది అభిమానుల్ని సొంతం చేసుకుని, అందరినీ విడిచి త్వరగా వెళ్లిపోవటం బాధాకరమన్నారు. పునీత్ కుటుంబసభ్యులకు, సన్నిహితులకు లోకేశ్ సానుభూతి తెలిపారు.
పునీత్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు : పవన్
పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునీత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తునన్నారు. కన్నడ కంఠీరవ దివంగత రాజ్ కుమార్ కుమారుడిగా ఆయన అడుగుజాడల్లో నట ప్రయాణం సాగిస్తున్న పునీత్ గుండెపోటుతో స్వర్గస్తులు కావటం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాల నటుడిగానే కన్నడ ప్రేక్షకులకు చేరువైన ఆయన ఆ దశలోనే ఎన్నో పురస్కారాలు అందుకొన్నారని కొనియడారు. కథానాయకుడిగా ఎన్నో విజయాలు దక్కించుకొని, ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ అనూహ్యంగా మృతి చెందటం సినీ ప్రేక్షకులకు బాధాకరమన్నారు. పునీత్ కుటుంబానికి పవన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదీ చదవండి