ఆనాడు పోతిరెడ్డిపాడును వైఎస్ఆర్ 43 వేల క్యూసెక్కులకు పెంచితే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు యత్నిస్తున్నారని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు పెంపుపై ఆనాడు అడ్డుకోని నాయకులు.. ఇవాళ గగ్గోలు పెడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ ప్రాజెక్టును 80 వేల క్యూసెక్కులకు తీసుకుపోనివ్వరని ధీమా వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అదనపు నిర్మాణం చేపడితే... ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు ఎడారి అవుతాయని గుత్తా తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోతిరెడ్డిపాడు విస్తరణ చేపడితే తాను కాంగ్రెస్‌లో ఉండి తీవ్రంగా వ్యతిరేకించినట్లు గుర్తు చేశారు.
మాజీ మంత్రి బీజేపీ నేత డీకే అరుణ... హంద్రీనీవాకు నీళ్లు వెళ్లినప్పుడు హారతిపట్టారని మండిపడ్డారు. ఆ సమయంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వాలు పూర్తి చేయలేదని.... దక్షిణ తెలంగాణలో చాలా ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం చేపట్టిందని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.
అందరం కలిసి ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు జీవోను అడ్డుకుందామన్నారు. దీనికి రెండు జాతీయ పార్టీలు కలిసి రావాలన్నారు. ఏపీ ప్రభుత్వం 203జీవోను రద్దు చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎంకు అప్పీలు చేస్తున్నట్లు గుత్తా తెలిపారు.
తెలంగాణలోని జిల్లాలను ఎడారిలాగా మారిపోయే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ పూనుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 80వేల క్యూసెక్కులకు తీసుకుపోనివ్వరని ఆశిస్తున్నాను. - గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడుపై రాష్ట్రాన్ని వివరాలు కోరనున్న కృష్ణా బోర్డు!