INTERSTATE ROBBERS GANG COMMITING CRIMES: విజయవాడ పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ విజృంభిస్తోంది. వరుస దొంగతనాలతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా పెమమలూరు మండలం పోరంకిలోని గేటెడ్ కమ్యూనిటిలో జరిగిన దొంగతనం ఘటనతో.. ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. కేవలం ఖరీదైన అపార్ట్‌మెంట్లు, విల్లాలు, తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు తెగబడుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా.. తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య సమయంలోనే చోరీలకు పాల్పడుతూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత నెల 30న విజయవాడ సీవీఆర్ వంతెన సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో తెల్లవారుజామన 2 గంటల 10 నిమిషాలకు, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో 2 గంటల 16 నిమిషాలకు , గుంటూరు జిల్లా తాడేపల్లిలో 2 గంటల 39 నిమిషాలకు, పోరంకిలో 2 గంటల 12 నిమిషాలకు ఇళ్లలోకి చొరబడినట్లు.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
నాలుగు ఘటనల్లోని దృశ్యాలను విశ్లేషించిన పోలీసులు.. వీరంతా ఒకే ప్రాంతానికి చెందినవారై ఉంటారన్న నిర్ణయానికి వచ్చారు. అన్ని ఘటనల్లో ఉన్న వారి ఆహార్యం, నడక తీరు ఒకేల ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. సీసీటీవీ దృశ్యాల నుంచి సేకరించిన నిందితుల చిత్రాలను.. గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని నేరవిభాగాలకు పంపించారు. వీరంతా గుజరాత్‌లోని దాహోద్‌లో ఓ తెగకు చెందిన వారిగా ఆ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించినట్లు తెలిసింది. అక్కడి నుంచి రెండు ముఠాలు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అరెస్టు చేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యుల ఫోటోలను తెప్పించి.. విజయవాడ పోలీసులు పోల్చిచూస్తున్నారు. గుజరాత్ నేర విభాగం నుంచి కూడా అనుమానిత చిత్రాలను తెప్పించారు. గుజరాత్‌తో పాటు.. మధ్యప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉంటి ఉంటారని అనుమానంతో.. ఆ ప్రాంతాలకూ ప్రత్యేక బృందాలను పంపించాలని నిర్ణయించారు.
పోలీసులకు దొరక్కుండా ఈ ముఠా.. రైలు పట్టాలపైనే రాకపోకలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పోరంకికి మాత్రం లారీలో వచ్చినట్లు తెలిసింది. ముఠా సభ్యులు తాము ఎంచుకున్న లక్ష్యానికి సమీపంలో ముందుగానే తిష్ట వేసి.. తెల్లవారుజామున దొంగతనాలకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఫోన్లు వాడుతున్నట్లు ఇప్పటివరకు నిర్ధరణ కాలేదు. చోరీ జరుగుతున్న ప్రాంతాల్లోని సెల్ టవర్ల ద్వారా గుర్తించే ప్రయత్నం చేస్తున్నా.. ఫలితం ఉండట్లేదు.
ఇదీ చదవండి:
AP GOVERNOR BISWABHUSAN DISCHARGE: ఆస్పత్రి నుంచి.. గవర్నర్ బిశ్వభూషణ్ డిశ్చార్జ్