ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ సోకుతున్న వారిలో లక్షణాలు లేని వారి సంఖ్యే ఎక్కువ ఉందని... రాష్ట్రప్రభుత్వం కేంద్ర బృందానికి తెలియజేసింది. కరోనా వ్యాప్తి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పరిశీలన కోసం వచ్చిన కేంద్ర బృందం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో భేటీ అయ్యింది. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకుంది.
ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఇద్దరేసి సభ్యుల చొప్పున క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి దీనిపై నివేదిక ఇవ్వనున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్యారోగ్యశాఖ అధికారులు కేంద్రబృందం సభ్యులకు వివరించారు. ప్రస్తుతం వెలుగు చూస్తున్న కేసులన్నీ రెడ్ జోన్లు, కంటైన్మెంటు క్లస్టర్లలోనే ఉన్నట్టుగా వైద్యారోగ్యశాఖ తెలియజేసింది. అనుమానితుల్లో 80 శాతం మందికి కరోనా వైరస్ లక్షణాలు లేవని కేంద్ర బృందానికి వివరించారు.
కరోనా బారినపడిన ఫ్రంట్ లైన్ వర్కర్ల వివరాలను కేంద్ర బృందానికి అందించింది. 67 మంది వైద్య సేవలందించే సిబ్బందికి వైరస్ సోకిందని తెలిపింది. 89 మంది ఇతర ప్రభుత్వ అధికారులకు వైరస్ సోకిందని వివరించింది. వీరిలో పోలీస్, రెవెన్యూ, శానిటరీ, వాలంటీర్లు, ఆశా వర్కర్లు వంటి వారున్నారని వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో 37 మంది సూపర్ స్ప్రెడర్స్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. వీరిలో ఒకరి కారణంగా అత్యధికంగా 34 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు గుర్తించామని కేంద్ర బృందానికి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మార్గదర్శకాల మేరకు వివిధ అంశాలను అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టం చేశారు.