CBN ON Madrasa: వైకాపా నేతల కక్ష సాధింపు చర్యలకు గుడి, బడి తేడా లేకుండా పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. పేదలకు చదువు చెప్పే మదరసాను సీజ్ చేయడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మదరసా స్థలాలపై ప్రభుత్వం కన్ను పడిందని.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా మదరసాను కొనసాగించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల వక్ఫ్ భూములను వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారన్న చంద్రబాబు..వక్ఫ్ బోర్డు అధికారి మహబూబ్ బాషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మించిన మదర్సాను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కర్నూలు జిల్లా నంద్యాలలో ఉద్రిక్తతకు దారితీసింది. లీజు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంతో దానిని అధికారులు సీజ్ చేసేందుకు యత్నించారు. అందుకోసం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సొమ్ము చెల్లించేందుకు కొంత సమయం కావాలని మదర్సా నిర్వాహకులు కోరినా అధికారులు వినకపోవడంతో వాగ్వాదం జరిగింది.
పలు చోట్ల వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణకు గురైనా పట్టించుకోని అధికారులు తమ వద్దకు రావడమేంటని మదర్సా నిర్వాహకుడు.. తెదేపా మైనార్టీ విభాగం అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అక్కడికి చేరుకుని గడువు ఇవ్వాలని కోరడంతో అధికారులు 10 రోజులు గడువు ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: