ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందని... ముఖ్యంగా మహిళలు ఎదుర్కొనే రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినాన్ని పురస్కరించుకుని... విజయవాడలోని నిర్వహించిన 3కే వాకథాన్‌ను రోజా జెండా ఊపి ప్రారంభించారు. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, బొమ్మిడాల క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో వివిధ కళాశాల విద్యార్థినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమైన 3కే వాకథాన్ బందర్ రోడ్డు మీదుగా సాగింది. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడంతోపాటు.... ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు అమెరికన్ ఆంకాలజీ వైద్య నిపుణుడు సుబ్బారావు వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థినులకు ఈ అవగాహన కల్పించడం వల్ల....వారి ద్వారా గ్రామాల్లోని ప్రజలకు క్యాన్సర్ గురించి తెలిపేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి...'క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి'