2017-18 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభాగాలు, ఆర్ధిక నిర్వహణపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక సమర్పించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2017-18 ఆర్ధిక సంవత్సరానికి 8,03,873 కోట్లుగా ఉందని కాగ్ పేర్కోంది. 2017-18లో రెవెన్యూ రాబడి జీఎస్డీపీలో 1,05,062 కోట్లుగా( 13.7 శాతం) ఉందని అంతకు ముందు ఏడాది కన్నా ఇది 6 వేల 78 కోట్ల రూపాయల మేర పెరిగిందని కాగ్ స్పష్టం చేసింది. 2016-17తో పోలిస్తే రెవన్యూ వ్యయం కూడా 1,21,214 కోట్లు పెరిగిందని తన నివేదికలో తెలిపింది. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 16,152 కోట్లుగా పేర్కొన్న కాగ్ ..14 ఆర్థిక సంఘం నిర్దేశించన పరిమితి కన్నా ఎక్కువ లోటు నమోదైనట్లు నివేదికలోవెల్లడించింది. జీఎస్డీపీలో ప్రభుత్వ రుణబకాయిల నిష్పత్తి 21 శాతం గా ఉందని..అయితే 14 ఆర్థిక సంఘం నిర్దేశించిన 25.09శాతం పరిమితిలోనే రుణబకాయిలు ఉన్నట్లు పేర్కోంది.
మరోవైపు రాష్ట్రప్రభుత్వం తీర్చాల్సిన అప్పులు జీఎస్డీపీలో 27.83 శాతంగా ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర రుణేతర రాబడులు ప్రాథమిక రెవన్యూ వ్యయానికి సరిపడేంతగా లేదని పేర్కోంది. 2017-18లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు బడ్జెట్ అంచనాల కన్నా 20,434 కోట్లు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వ తప్పనిసరి ఖర్చులు 70, 045 కోట్లుగా ఉన్నాయని, వడ్డీ చెల్లింపులు, ఫించను చెల్లింపుల కారణంగా ఈ ఖర్చులు పెరుగుదల నమోదైందని పేర్కోంది. 2014-18 సంవత్సరాల్లో ప్రాజెక్టులపై 49,326 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు కాగ్ తెలిపింది. నీటి పారుదల, వరదల నియంత్రణలో 8,243 కోట్లు ఖర్చు చేశారని స్పష్టం చేసింది. ప్రాజెక్టులు పూర్తిచేయటంలో జరిగిన జాప్యం ఖర్చు, నాణ్యతలపై ప్రభావం చూపిందని పేర్కోంది.2018 మార్చి 31 తేదీనాటికి 27 ప్రాజెక్టులపై 43,031 కోట్లు ఖర్చు చేశారని స్పష్టం చేసింది. నిర్దేశిత సమయంలో పూర్తికాకపోవటం వల్ల అంచనాల విలువ 58039 .93 కోట్లకు పెరిగిందని నివేదికలో పేర్కోంది. ఫలితంగా 29,616 కోట్ల ఆర్ధికభారం రాష్ట్రఖజానా పై పడినట్టు కాగ్ స్పష్టం చేసింది.
వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల్లో భాగంగా రిజర్వు బ్యాంకు వద్ద రోజువారీ 1.93 కోట్ల నగదు నిల్వ ఉంచాల్సి ఉంటే 2017-18లో 134 రోజులు మాత్రమే ఉందని కాగ్ స్పష్టం చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్‌కు 2016లో 27 కోట్లు, 2018లో 44 కోట్లు వడ్డీ చెల్లించినట్టు కాగ్ పేర్కోంది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రుణబకాయిలు 1,68,791 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. అంతకుముందు ఏడాదికన్నా 18, 983 కోట్లు పెరిగాయని నివేదికలో పేర్కోంది. వచ్చే ఏడేళ్లలో 91 వేల 599 కోట్ల రుణాలను రాష్ట్రం తీర్చాల్సి ఉంటుందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ స్పష్టం చేసింది. 14వ ఆర్ధికసంఘం సూచనలకు అనుగుణంగా ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఏపీ సవరించాల్సి ఉందని పేర్కోంది. రాష్ట్ర విభజన జరిగినా మూలధన పద్దుల కింద ఉన్న 1,51,349 కోట్ల రుణాలు, అడ్వాన్సు పద్దుల కింద ఉన్న 28,099 కోట్ల మొత్తాలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య పంపకాలు జరగలేదని పేర్కోంది.
బడ్జెట్ లో కేటాయింపులు లేకుండానే 18 అంశాల్లో 1964 కోట్ల రూపాయల మొత్తాన్ని ఖర్చు చేసినట్టు కాగ్ స్పష్టం చేసింది. 2004 నుంచి 2017 మధ్య కాలాల్లో కేటాయింపులకు మించి చేసిన 55,360 కోట్ల అధికవ్యయాన్ని క్రమబద్దీకరించుకోలేదని పేర్కోంది.అత్యవసర సందర్భాల్లో మినహా రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందకుండా ఖర్చు చేయడాన్ని పూర్తిగా నిలిపివేయాలని కాగ్ సిఫార్సు చేసింది. పీడీ ఖాతాల్లో అత్యధికంగా శూన్యనిల్వలు ఉండటం 50 ఖాతాల్లో మాత్రం భారీగా ముగింపు నిల్వలు ఉండటం ఆందోళనకరమని తెలియచేసింది. శూన్య నిల్వలతో పీడీ ఖాతాలు నిర్వహించటం కొన్నిటిలో భారీ నిల్వలు ఉండటం శాసన పరమైన ఆర్థిక నియంత్రణ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
ఇక చాలా శాఖలకు కేటాయింపులు చేసినా వాటిని తక్కువగానే ఖర్చు చేశార నిధులు మిగిలిపోయాయని తెలియజేసింది. మున్సిపల్ శాఖకు 5014 కోట్లు కేటాయించి కేవలం 3719 కోట్లే ఖర్చు చేశారని తెలిపింది. గ్రామీణాభివృద్ధిశాఖకు 16787 కోట్లు కేటాయించి 13 వేల272 కోట్లే ఖర్చు చేశారని తెలిపింది.రోడ్లు, భవనాల శాఖకు 3,649.16 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది 914.17 కోట్లేనని పేర్కోంది. ఆర్థిక పాలన, ప్రణాళిక సర్వేలకు 22,863 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది 21,808 కోట్లని పేర్కోంది. పాఠశాల విద్యకు 18,950 కోట్లు కేటాయిస్తే ..16,909.17 కోట్లు మాత్రం ఖర్చు చేశారంది.మొత్తం 10 శాఖలకు 91, 050.7 కోట్లు కేటాయించి కేవలం 66 , 874 .7 కోట్లు ఖర్చు చేసారని పేర్కోంది. మిగిలిన 24 ,175 .96 కోట్లు ఖర్చు చేయలేదని స్పష్టం చేసింది.