తెలంగాణలో దుబ్బాక, బిహార్‌లో ఎన్డీఏ కూటమి, భాజపా అభ్యర్థులకు సానుకూల ఫలితాలు రావటాన్ని...తాము వినమ్రతతో స్వీకరిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ఫలితాలు ఏపీలోనూ ప్రభావం చూపిస్తాయన్నారు. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర నుంచి తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు ఉంటాయన్నారు. రాయలసీమ జిల్లాల్లోనూ అనేకమంది భాజపాలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భాజపా నేతలు సంబరాలు జరుపుకున్నారు.
విజయవాడ
విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాలతో టపాసులు కాల్చి... మిఠాయిలు పంచారు. భాజపా మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా భాజపాకు ఆదరణ పెరుగుతోందనడానికి ఈ ఫలితాలే ఒక ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా విశ్వసిస్తున్నారని... ఈ స్ఫూర్తితో వచ్చే ఎన్నికలలో కేంద్రంలోనే కాకుండా రాష్ట్రంలోనూ భాజపా అధికారంలోకి రావడం ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ఎన్నికల్లో భాజపా గెలుపొందడంతో...టపాసులు కాల్చి ఆనందోత్సవాలను తెలియజేశారు.
విశాఖ జిల్లా
దుబ్బాక ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంతో అనకాపల్లిలో భాజపా నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఏపీలోని భాజపా విజయకేతనం ఎగర వేస్తుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా గ్రామీణ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడం పట్ల... ధర్మవరంలో భాజపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని కళాజ్యోతి కూడలి వద్ద నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ కూడలి వద్ద బాణసంచా కాల్చారు. ప్రధాని మోదీ అందిస్తున్న సుస్థిర పాలన వల్లే దేశంలో భాజపా వైపు మెుగ్గు చూపుతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
చిత్తూరు జిల్లా
దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా విజయంపై శ్రీకాళహస్తిలో భాజపా నేతలు సంబరాలు చేసుకున్నారు. భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిథి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. కోలాహలంగా మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
కర్నూలు జిల్లా
నంద్యాలలో భాజపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. భాజపా కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
నెల్లూరు జిల్లా
నాయుడుపేట గడియారం కూడలిలో భాజపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం దుబ్బాకలో భాజపా విజయం సాధించడంతో మిఠాయిలు పంచి పండుగ వాతావరణం సృష్టించారు.
ఇదీ చదవండి: