విజయనగరం జిల్లాలో...
భాజపా చేపట్టిన ఛలో రామతీర్థం పిలుపుతో భాజపా, జనసేన శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నుంచే నిరసన కారులు పెద్ద సంఖ్యలో రామతీర్థం, పరిసర గ్రామాలకు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. పరిసర గ్రామాల్లో పోలీసు పహారా కొనసాగుతోంది.
ఛలో రామతీర్ధం కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా పోలీసులను మోహరించారు. రామతీర్థం వెళ్లే భాజాపా, జనసేన ముఖ్య నేతలను పోలీసులు అరెస్టులు చేశారు. దీంతో ఆ పార్టీల నేతలు ప్రభుత్వ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో రామున్ని దర్శించుకునేందుకు వెళ్తున్న తమను అడ్డుకొని అరెస్టులు చేయడం సరికాదన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టును నిరసిస్తూ.. పార్వతీపురంలో పార్టీ నేతలు నిరసన చేపట్టారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుర గాల ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్మ యాత్ర చేపట్టాలనుకున్న నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని.. వీర్రాజును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో..
రామతీర్థం కొండపైకి భాజపా నేతలను అనుమతించకపోవడం దారుణం అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పోలీసులు, ప్రభుత్వం వైఫల్యంతోనే దేవాలయాలపై వరుస ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోపాటు ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని.. దీనికి నిరసనగా తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమ పార్టీ నేతలను గృహ నిర్బంధాలు, అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లాలో
రామతీర్థం ఘటన హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. రామతీర్థం వెళ్తున్న భాజపా, జనసేన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలన చేయాల్సిన మంత్రులు ప్రతిపక్షలపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ధర్మవరంలో జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. విగ్రహాల ధ్వంసం ఘటనలు వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆలయాల రక్షణలో విఫలమైందని.. ప్రజలు తగిన సరైన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు.
ప్రకాశం జిల్లాలో
ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. చినగంజాంలో భాజపా, జనసేన ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దాడులకు పాల్పడ్డ వాళ్లపై చర్యలు తీసుకోవాలని. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లాలో...
రాష్ట్రంలో రాక్షస పాలనలో కొనసాగుతోందని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. వైకాపా.. దుర్మార్గపు చర్యలతో భయబ్రాంతులకు గురిచేస్తే ఉద్యమాలు ఆగిపోవన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో హిందూ దేవతలు, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రశ్నించే హక్కు హిందువులకు లేదా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేయడం వైకాపా ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. అప్పటికీ దోషులను గుర్తించకపోవడం ప్రభుత్వం చేతకానితనాన్ని నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ బాధ్యతగా వ్యవహరించి దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో...
రామతీర్థంలో విగ్రహాల ధ్వంసంకు నిరసనగా భాజపా, జనసేన నాయకులు నిరసన ర్యాలీ చేపట్టింది. మైలవరం స్థానిక పంచాయతీ ఆఫీస్ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైకాపా పాలన సాగుతోందని స్థానిక భాజపా నాయకులు బాలకోటేశ్వరరావు ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తామని జనసేన నేత అక్కల రామమోహనారావు పేర్కొన్నారు.
రామతీర్థం ఘటనను నిరసిస్తూ భాజపా, జనసేన నేతలు గన్నవరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే హిందూ ఆలయాలకు రక్షణ లేకుండాపోతుందని భాజపా రాష్ట్ర నేత చిగురుపాటి కుమారస్వామి విమర్శించారు.
కడప జిల్లాలో....
ఆలయాలను పరిరక్షించలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలంటూ భాజపా, జనసేన పార్టీ, హిందూ ఐక్య వేదిక, హిందూ ధర్మ జాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమస్తులను తొలగించాలన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. మైదుకూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కర్నూలు జిల్లాలో...
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. నంద్యాలలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గాంధీచౌక్ వద్ద ధర్నా చేపట్టారు. స్థానిక శ్రీ కాళికాంబ దేవి ఆలయం నుంచి కల్పనా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆలయాల్లో విగ్రహల ధ్వంసం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ.. దేవాదాయశాఖ మంత్రి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: