ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు (APNGO Association State President Bandi Srinivasa Rao) విమర్శించారు. నవంబరు నెలాఖరులోగా పీఆర్సీ (PRC) అమలు చేయకపోతే... భవిష్యత్ కార్యచరణ ప్రకటించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గుంటూరు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ హల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనారోగ్య సమస్యలు వస్తే వైద్యం చేయించుకోవటాని కనీసం హెల్త్ కార్డులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా గత నెలలోనే పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని చెప్పినట్లు గుర్తుచేశారు. ఉద్యోగులపై ప్రభుత్వం ఎందుకు వివక్షత చూపుతుందో అర్థం కావటం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నవంబరు నెలాఖరులోగా పీఆర్సీ అమలు చేయకపోతే ...ఈనెల 27, 28 తేదీలలో ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీవో సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇక ఓపిక పట్టే పరిస్థితి లేదని..తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 28లోగా పీఆర్‌సీ ఇవ్వకపోతే సమ్మె నోటీసు.. సర్కారుకు హెచ్చరిక