రాష్ట్రంలో 2019తో పోలిస్తే 2020లో కాగ్నిజిబుల్ నేరాలు(ap crime rate) (చర్యలు తీసుకోదగ్గవి) 15 శాతం మేర తగ్గాయని పోలీసు ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి గతేడాది 88,377 కేసులను నమోదు చేశామని.. వాటిని మినహాయిస్తే ఐపీసీ సెక్షన్ల కింద 1,00,620 కేసులే నమోదయ్యాయని పేర్కొంది. 2019లో వాటి సంఖ్య 1,19,229గా ఉండేదని వివరించింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజాగా విడుదల చేసిన వార్షిక నేర గణాంక నివేదికపై ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయం బుధవారం తన విశ్లేషణను విడుదల చేసింది. ప్రత్యేక స్థానిక చట్టాలు (ఎస్‌ఎల్‌ఎల్) సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో అత్యధికం ఇసుక, మద్యం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులపై పెట్టినవేనని, ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ఏర్పాటుతో ఈ కేసులు పెరిగాయని చెప్పింది. 2019తో పోలిస్తే 2020లో హత్యలు, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, అపహరణలు, దోపిడీలు, దొంగతనాల కేసులు తగ్గాయని వివరించింది. స్పందన, దిశ యాప్, ఏపీ పోలీసు సేవా యాప్, సైబర్ మిత్ర వాట్సాప్, డయల్ 112, డయల్ 100 ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 17,591 కేసులు గత ఏడాదిలో నమోదు చేశామని తెలిపింది.
ఇదీచదవండి..