ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ అంశాలను సత్వరమే నెరవేర్చాలని ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రిని కలసి కోరినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. ఉద్యోగులకు రావాల్సిన 11వ పీఆర్సీని 1.7.2018 నుంచి అమలు చేయాలని కోరారు. పే రివిజన్ కమిషన్ రిపోర్టును ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించినందున దీనిపై వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చించి 11వ పీఆర్సీని అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన 3 డీఏలను విడుదల చేసి.. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు తగ్గించిన వేతనాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.
ఎరియర్స్ లేకుండా డీఏలు చెల్లించాలన్న కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు... ప్రతి 6 నెలలకు వచ్చే కరవు భత్యాన్ని విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు, మహిళా టీచర్లతో సమానంగా ఏడాదికి 5 సీఎల్‌లు అదనంగా ఇవ్వాలన్నారు. జీపీఎఫ్, ఎపీజేఎల్ లోన్ల జాప్యం కాకుండా సకాలంలో చెల్లించాలని కోరారు. కొవిడ్ బారిన పడిన ఉద్యోగులకు నెల రోజులు సీఎల్‌లు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, ప్రతి ఉద్యోగికి ఇంటి స్థలం మంజూరు చేయాలన్నారు. మూడు రాజధానులు పెట్టాలని నిర్ణయించినందున విశాఖపట్నంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అసోషియేషన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి