కరోనా వైరస్ యూకే స్ట్రెయిన్ విస్తరిస్తుండటంతో మరోమారు కొవిడ్ నిబంధనల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతున్నందున తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న చికిత్సలు, కేసుల పెరుగుదల తదితర అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతీ కొవిడ్ ఆస్పత్రికి నోడల్ అధికారిని నియమించాలని వైద్యారోగ్యశాఖ సూచనలిచ్చింది. అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫైర్ ఆడిట్ నిర్వహించాలని.. తక్షణం రోగుల భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అగ్ని మాపక శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్-19కు ఉచితంగానే చికిత్స అందుతోందని.., ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చికిత్స అందించాల్సిందిగా సూచనలు ఇచ్చింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కొవిడ్ నియంత్రణ కోసం జారీచేసిన నిబంధనలు కఠినంగా అమలు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాస్కు ధరించేలా చూడాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. గతంలో చేపట్టిన మాస్కే కవచం కార్యక్రమం అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా జనసమూహాలకు అనుమతి నిరాకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది, కంటైయిన్మెంట్ వ్యూహాన్ని అనుసరించాలని సూచనలిచ్చారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా.. భారీగా జన సమూహాలు పోగుకాకుండా చూడాలన్నారు. కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. నమూనా సేకరణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 1,519 ప్రాంతాలను మరింతగా వికేంద్రీకరించి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా టోల్ ఫ్రీ నెంబరుగా 104ను కొనసాగించాలని.., మరిన్ని వైద్య సేవలు అందించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి.
కంటైయిన్మెంట్ జోన్ల నోటిఫై చేయటంతో పాటు ఫీవర్ క్లినిక్ల నిర్వహణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే నిర్వహణ, లక్షణాలు ఉన్నవారిని గుర్తించటం వంటి కార్యాచరణ చేపట్టాల్సింది అధికారులకు సూచించారు. కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.., గౌరవ ప్రదంగా వ్యవహరించాలని ఆదేశాలిచ్చారు. మృత దేహాల అంత్యక్రియల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 15 వేల రూపాయలను మృతుల కుటుంబాలకు అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.
ఇదీచదవండి
ఏ విదేశీ సంస్థకూ తీసిపోం.. యూకే స్ట్రెయిన్‌పైనా పనిచేస్తుంది: కృష్ణ ఎల్ల