YSRCP Govt Diverted Gram Panchayat Funds: పంచాయతీల అనుమతి తీసుకోకుండానే ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విద్యుత్ బకాయిల కింద పంపిణీ సంస్థలకు సర్దుబాటు(Diverted Gram Panchayat Funds to Electricity Board) చేస్తోంది. గత 5 నెలల్లో దాదాపు 12 వందల 45 కోట్లను రెండు విడతలుగా వెనక్కి తీశారు. సొంత ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే ఏ కొద్ది పంచాయతీల్లోనో తప్ప మిగిలినవన్నీ ప్రధానంగా ఆర్థిక సంఘం నిధులతోనే మనుగడ సాగిస్తున్నాయి. ఖాతాల్లో ఉన్న నిధులకు సరిపడా.. కొన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేసి, బిల్లుల కోసం ఎదురు చూస్తున్నాయి. మరికొన్ని పంచాయతీలు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు ప్రారంభించబోతున్నాయి. తమ అనుమతి లేకుండా ఖాతాల్ని ప్రభుత్వం చాలా వరకు ఖాళీ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల ఆందోళనలు
సొంత ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే కొన్ని మేజర్ పంచాయతీలకే మొత్తం ఆదాయంలో సగం సాధారణ నిధుల నుంచి, మరో సగం ఆర్థిక సంఘం నుంచి సమకూరుతుంది. కానీ మెజార్టీ పంచాయతీల ఆదాయంలో 70 శాతానికి పైగా ఆర్థిక సంఘం నిధులే ఆధారం. ప్రతి పంచాయతీకీ మూడు మార్గాల్లో ఆదాయం సమకూరుతుంది. అందులో మొదటిదైన సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆస్తిపన్ను సగం కూడా వసూలు కాదు. చిన్న పంచాయతీలకు సొంత వనరుల ద్వారా సమకూరేది నామమాత్రంగా ఉంటోంది. ప్రభుత్వం నుంచి పంచాయతీలకు తలసరి గ్రాంటు, వృత్తి పన్ను, సీనరేజి సహా...పంచాయతీ పరిధిలో జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా కొంత సమకూరుతుంది. ఒక్కో మనిషికి...ఏడాదికి కేవలం 4 రూపాయల చొప్పున ప్రభుత్వం తలసరి గ్రాంటు ఇస్తుంది. ఆ మొత్తం కూడా తోచినప్పుడు విడుదల చేయడం ఏంటని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే విద్యుత్తు పంపిణీ సంస్థలకు జమ
పంచాయతీలు 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేయడానికి 2021 మార్చి నుంచి 2022 మార్చి వరకు కేంద్రం గడువు పొడిగించింది. వీటిలో ప్రభుత్వం 344 కోట్ల 93 లక్షల్ని ఇప్పటికే విద్యుత్తు పంపిణీ సంస్థలకు జమ చేసింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని పంచాయతీలకు 12 వేల 856 కోట్లు కేటాయించింది. ఇందులో 2020-21, 2021-22లో.. పంచాయతీలకు విడుదల చేసిన 2 వేల 848 కోట్లలో దాదాపు 900 కోట్లు విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇటీవల సర్దుబాటు(Gram Panchayat Funds diverted to Electricity Board) చేశారు. పంచాయతీల్ని నిధులు ఖర్చు చేయనివ్వకుండా బిల్లుల మంజూరు విధానాన్ని సీఎఫ్ఎంఎస్ పేరుతో కేంద్రీకృతం చేయడంలోనే హేతుబద్ధత లేదని నిపుణులు అంటున్నారు. బిల్లులు చెల్లింపు రెండు మూడు నెలలు ఆలస్యమయ్యేది తప్ప.. ఇలా ఖాళీ చేయడం ఎప్పుడూ లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకూ కేటాయించిన ఐడీలను CFMS లో వెతుకుతుంటే సమాచారం లేదని వస్తోందంటున్నారు.
రెండుసార్లు నిధులు వెనక్కి
ప్రభుత్వం 2021 మార్చి 22న జారీచేసిన జీవో 569 ఆధారంగా పంచాయతీ ఖాతాల్లోని ఆర్థిక సంఘం నిధులను విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఆర్థికశాఖ సర్దుబాటు(YSRCP Govt Diverted Gram Panchayat Funds to Electricity Board) చేస్తోంది. జీవో వెలువడ్డాక పంచాయతీ ఖాతాల నుంచి రెండుసార్లు నిధులు వెనక్కి తీశారు. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలకు బకాయిల్ని చెల్లించేందుకు కేంద్ర ఇంధనశాఖ లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్ స్కీమ్ పేరుతో ప్రభుత్వానికి షరతులతో రూ. 6 వేల 600 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. తొలి విడతగా 3 వేల 300 కోట్లు విడుదల చేసింది. రెండో విడత నిధులు ఇవ్వాలంటే డిస్కంలకు పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల్ని, పాత బకాయిలను పంచాయతీ నిధుల నుంచి మినహాయించి డిస్కంల ఖాతాలకు జమచేయాలని షరతు పెట్టింది. ఈ అంశంపై అప్పట్లో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్న ఆదిత్యనాథ్‌దాస్ జీవో జారీ చేశారు. పంచాయతీలకు చెందిన ఆరు ఖాతాల నుంచి నిధుల సర్దుబాటుకు అప్పట్లో అనుమతించారు.
ఆర్థిక సంఘం నిధులు ఇక నుంచి గ్రామ పంచాయతీలకు చెందిన ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీ పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఇందుకోసం ఖాతాలు తెరిచేలా ఆదేశాలు ఇస్తామంటున్నారు.
ఇదీ చదవండి...
AP HIGH COURT: మాదకద్రవ్యాల కేసుల్లో.. పెద్ద తలకాయలను పట్టుకోరా?: హైకోర్టు