రిజర్వుబ్యాంకు మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో.. ఆంధ్రప్రదేశ్ పాల్గొని రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తీసుకున్న వడ్డీ రేటు ఎక్కువ. రాష్ట్రం రూ.వెయ్యి కోట్లు 7.13% వడ్డీతో 15 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా రుణం తీసుకుంది. మరో రూ.1,000 కోట్లు 7.14% వడ్డీతో 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకుంది. దీంతో ఈ నెలలో ఇంతవరకూ రూ.4,000 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకున్నట్లయింది. ఓవర్‌డ్రాఫ్టుతో నెట్టుకొస్తున్న రాష్ట్రంలో ఈ రుణం కొన్నిసార్లు రాష్ట్ర ఖజానాకు చేరకుండా ఓడీ కింద జమ అవుతోంది.
మంగళవారం వేలంలో గుజరాత్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, మణిపుర్, నాగాలాండ్, రాజస్థాన్, తమిళనాడు కూడా రుణాలు స్వీకరించాయి. అవి 8-11 ఏళ్ల కాలపరిమితితో 6.75 నుంచి 7.03% వడ్డీకి తీసుకున్నాయి. రాష్ట్రాల సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు ఆధారంగానే వడ్డీలు నిర్ణయిస్తారు.
ఆర్థిక నిర్వహణ ఆధారంగానే స్కోరు
రాష్ట్రానికి నగదు అందుబాటులో లేనప్పుడు వేస్ అండ్ మీన్స్ వెసులుబాటు, ప్రత్యేక డ్రాయింగు సౌలభ్యం వినియోగించుకుంటూ వాటి కింద బిల్లులు, ఇతర చెల్లింపులు చేస్తారు. వీటికి 4% వరకు వడ్డీ చెల్లించాలి. వేస్ అండ్ మీన్స్ కింద రూ.2,416 కోట్ల మేర వినియోగించుకోవచ్చు. తర్వాత ప్రత్యేక డ్రాయింగు సదుపాయం కింద రూ.900 కోట్ల వరకు వినియోగించుకోవచ్చు. రిజర్వుబ్యాంకు వద్ద మనకున్న డిపాజిట్ల ఆధారంగా ఈ మొత్తం నిర్ణయిస్తారు. ఈ రెండు వాడుకున్న తర్వాతా రాష్ట్ర ఆదాయం లేకుండా బిల్లులు చెల్లిస్తే అది ఓవర్‌డ్రాఫ్ట్ అవుతుంది. ఓడీ కింద రూ.1,400 కోట్ల వరకు 14 రోజులు వినియోగించుకునే ఆస్కారం ఉంది. ఆ మొత్తాన్ని మించి వాడితే నాలుగు రోజుల్లోనే జమచేయాలి.
మొత్తం బహిరంగ మార్కెట్ రుణం రూ.29,750 కోట్లు
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ రాష్ట్రం రూ.29,750 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి రుణం తీసుకుంది.
- మొదట తొలి 9 నెలలకు కేంద్రం రూ.20,750 కోట్లకే అనుమతించింది.
- సెప్టెంబరు రెండోవారంలో మరో రూ.10,500 కోట్లకు అవకాశం కల్పించింది.
- మూలధన వ్యయంతో అనుసంధానమైన అప్పు రూ.2,655 కోట్లకు అనుమతించింది.
- మొత్తం రూ.33,905 కోట్లకు 29,750 కోట్ల రుణసమీకరణ పూర్తయింది. ఇక డిసెంబరు నెలాఖరు వరకు రూ.4,155 కోట్ల రుణం తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: APPSC Notification: నిరుద్యోగులకు శుభవార్త...4 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల