రాష్ట్రంలో ఇప్పటివరకు 1,551 బ్లాక్ ఫంగస్(black fungus) కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ (ak singhal) స్పష్టం చేశారు. ఫంగస్ కారణంగా 103 మంది మరణించినట్లు వెల్లడించారు. బ్లాక్‌ఫంగస్(black fungus) చికిత్స ఔషధాలను కేంద్రం ఇస్తోందని..అయినప్పటికీ మనమే కొనుగోలు చేయాలన్నారు. ఫంగస్ చికిత్స కోసం 91,650 ఇంజెక్షన్లు ఆర్డర్ చేయగా...13,105 ఇంజెక్షన్లు మాత్రమే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 1,225 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.
'పాజిటివిటీ రేటు తగ్గుతోంది'
తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, జిల్లాల్లో క్రమంగా కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోందని సింఘాల్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లోనూ దీన్ని నియంత్రించాల్సి ఉందని అందుకే కర్ఫ్యూను పొడిగించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. జూన్ 11 నుంచి 20 వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపు ఉంటుందని అనంతరం 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. 104 టెలి కన్సల్టేషన్ ద్వారా ఇప్పటి వరకు 5 లక్షల మందికి వైద్య సేవలందించామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని సింఘాల్ స్పష్టం చేశారు.
ఇదీచదవండి: Covid Third Wave: పీడియాట్రిక్ వార్డులు ఏర్పాటు చేయండి: సీఎం జగన్