MINISTER PERNI NANI: రాష్ట్రంలో సినిమా థియేటర్ల యజమానులకు తాత్కాలిక ఊరట లభించింది. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నెల రోజుల్లోపు అన్ని వసతులు కల్పించాలంటూ ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో 9 జిల్లాల్లోని 83 థియేటర్లకు ఊరట లభించింది. అవసరమైన అనుమతులు కల్పించి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు థియేటర్ యజమానులు దరఖాస్తు చేసుకోవాలని.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సూచించారు.
సెప్టెంబర్ నుంచే థియేటర్ యజమానులను హెచ్చరిస్తున్నాం. నిబంధనలు పాటించకపోవడంతో తనిఖీ చేసి నోటీసులు ఇచ్చారు. నిబంధనలు పాటించని థియేటర్లను ఎలా నడపమంటారో చెప్పాలి. ఏదైనా జరిగితే ప్రభుత్వం గురించి మాట్లాడుకోరా?. ఇప్పటికైనా లైసెన్స్‌లు రెన్యూవల్ చేసుకుని నిబంధనలు పాటించాలి. - పేర్ని నాని, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి
సినీ నిర్మాత, నటుడు నారాయణ మూర్తి ఈ సందర్భంగా మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలో కలిశారు. సినీ పరిశ్రమ బతకాలి, ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడొద్దని మంత్రితో మాట్లాడిన అనంతరం మీడియాతో అన్నారు. సినిమా తీసేవాడు, నటించేవాడు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. సినీ పెద్దలంతా సీఎంతో మాట్లాడే ఏర్పాటు కోసం మంత్రిని కోరినట్లు పేర్కొన్నారు. వీటికి తోడు మరికొన్ని విషయాలు వ్యక్తిగతంగా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చినట్లు నారాయణమూర్తి మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: Cinema Theaters Open: సీజ్ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి