రాజధాని అమరావతిలో పర్యటించిన జాతీయ మహిళా కమిషన్ సభ్యులు... అనంతరం విజయవాడ క్లబ్‌కు చేరుకున్నారు. కమిషన్ సభ్యులు వచ్చారని వార్త తెలియగానే వందలాదిమంది మహిళలు అక్కడికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా తమపై ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి వేధింపులు జరుపుతున్నారో కమిషన్ సభ్యులకు వారు పూసగుచ్చినట్టు వివరించారు. తమ కులం పేరు అడిగి వేధింపులకు గురి చేస్తున్నారని లిఖిత పూర్వకంగా జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో పోలీసుల వేధింపులు, స్థానిక పరిస్థితులను తెలియజేసేందుకు కమిషన్ సభ్యులు తగిన సమయం ఇవ్వలేదని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ కమిషన్ సభ్యుల ఎదుట నినాదాలు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలను కమిషన్ పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు నినాదాలు చేశారు. విజయవాడ క్లబ్‌లో భోజన విరామానంతరం కమిషన్ సభ్యులు కొద్దిసేపు రైతులు, మహిళల అభిప్రాయాలు తెలుసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
మహిళా పోలీసుల ఫిర్యాదు
జాతీయ మహిళా కమిషన్ సభ్యులు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలో మహిళా పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. రాజధాని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో విధుల్లో ఉన్న తమపై స్థానికులు దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. తాము వీధుల్లో పహారా కాస్తుంటే పేడ నీళ్లు చిలకరిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు వారు గుంటూరులో మహిళా కమిషన్ సభ్యులకు పోలీసు సిబ్బంది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి: