అమ్మఒడి వర్తించాలంటే విద్యార్థులకు కనీసం 75శాతం హాజరు ఉండాలనే నిబంధన అమలు వల్ల.. 51 వేల మంది తల్లులు 2021-22 విద్యాసంవత్సరానికి లబ్ధి కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకుండా పిల్లల్ని క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారికి కనీసం 75 శాతం హాజరు ఉండేలా తల్లులే బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. డ్రాపవుట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కనీస హాజరు నిబంధన పెట్టామని వివరించింది.
2019లో పథకం ప్రవేశపెట్టినప్పుడు ఇచ్చిన ఉత్తర్వులోనే ఈ నిబంధన ఉందని తెలిపింది. అయితే తొలి ఏడాది కావటంతో 2019-20లో, కరోనా వల్ల విద్యా సంస్థలు మూతపడినందున 2020-21లో కనీస హాజరు నిబంధనను సడలించామని చెప్పింది. ఈ పథకం కింద పిల్లల్ని బడికి పంపించే ఒక్కో తల్లికి అందించే రూ.15,000 ఆర్థిక సాయం నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.2 వేలు జమ చేస్తున్నట్లు వివరించింది.
‘‘జగనన్న అమ్మఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాదీ అమలు చేస్తున్నాం. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ వారి తల్లుల ఖాతాల్లో రూ.6,595 కోట్లు జమ చేయనున్నాం. శ్రీకాకుళంలో సోమవారం జరిగే కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
వీటితో కలిపితే ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందించిన మొత్తం రూ.19,618 కోట్లు. 2019-20 విద్యాసంవత్సరంలో 42,33,098 మంది లబ్ధిదారులకు రూ.6,349.53 కోట్లు, 2020-21లో 44,48,865 మందికి రూ.6,673 కోట్లు ఇచ్చాం. 2021-22కి సంబంధించి సోమవారం 43,96,402 మంది తల్లులకు రూ.6,595 కోట్లు ఇస్తున్నాం’’ అని ప్రకటనలో తెలిపింది.
ఇవీ చూడండి: