గుజరాత్‌లోని వీరావల్‌లో 5 వేల మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌తో వీరంతా సముద్రపు ఒడ్డున బోట్లలోనే ఆవాసముంటూ, కుటుంబాలకు దూరంగా... దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీరిలో వారం రోజుల కిందట ఒకరు, బుధవారం మరొకరు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించేశారు. కుటుంబ సభ్యులకు చివరిచూపు దక్కలేదు. అక్కడున్న వారి కష్టాలు తెలుసుకునేందుకు 'ఈటీవీ భారత్' ప్రతినిధి ఫోన్లో సంప్రదిస్తే... బాధలు చెప్పి కన్నీటిపర్యంతమయ్యారు.
ఇంకెంత మందిమి చనిపోతామో?: అమ్మోరు
అనారోగ్యం, ఇంటికి వెళ్లలేమేమోనన్న బెంగతో పది రోజుల్లో ఇద్దరు చనిపోయారు. మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఎంత మందిమి చనిపోతామో తెలీదు. ఒక పూట తిండి మూడు పూటలు సర్దుకుంటున్నాం. పగలు ఎండల దెబ్బ, రాత్రి దోమల కాటుకి అల్లాడిపోతున్నాం.
స్నానానికీ నీళ్లు లేవు: ధనరాజ్
ఒడ్డుకు వచ్చి నెల రోజులైంది. నీళ్లు లేక అప్పటి నుంచి స్నానం చేయలేకపోయాం. ట్యాంకుల్లో నిల్వ చేసిన నీటినే ఇప్పటికీ తాగుతున్నాం. సముద్రం ఒడ్డున ఒక్కో బోటులో 8-10 మంది చొప్పున 5 వేల మంది ఒకే చోట ఉంటున్నాం.
ఒకే జత దుస్తులతో: ఎర్రయ్య
మార్చుకోవటానికి మరో జత దుస్తులు లేవు. ఒకటే జతతో సర్దుకుంటున్నాం. నీటిలో వాటిని తడిపి... ఆరినంతవరకూ టవల్ కట్టుకుంటున్నాం. ఆరిన తర్వాత మళ్లీ అవే ధరిస్తున్నాం. నెల రోజులుగా మాది ఇదే పరిస్థితి.
వీరావల్‌లో మేమున్న ప్రాంతానికి కొద్ది దూరంలోనే కొందరికి కరోనా సోకింది. ఏ మాత్రం రక్షణ లేని.. ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటున్నాం. మాలో ఒక్కరికి కరోనా సోకినా అందరం బలైపోతాం. చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతున్నా.. బయటకు చెప్పుకోలేకపోతున్నారు.
సరకులివ్వటం తప్ప ఏమీ చేయలేదు: రాజారావు
శ్రీకాకుళం నుంచి అధికారుల బృందం వీరావల్‌కు వచ్చింది. ఒక్కోబోటుకు పది కిలోల బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పులు కిలో చొప్పున, రెండు దుప్పట్లు, మాస్కులు అందించటం మినహా వారేమీ సాయం చేయలేదు. మాకు వేరే చోట వసతి కల్పించటమో, శ్రీకాకుళం తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం గురించో ఆలోచించలేదు. మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నట్లు అధికారులకు నివేదిక ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం ఎలాంటి సాయమూ అందించలేదు.
కూతురిని చూడకుండానే ప్రాణాలొదిలి..
ఉపాధిని వెతుక్కుంటూ గుజరాత్‌కు వలస వెళ్లిన మత్స్యకారుడు మగుపల్లి కొయిరాజు(28) మంగళవారం రాత్రి అనారోగ్యంతో అక్కడే మృతిచెందారు. ఈయనకు ఏడాదిన్నర క్రితమే వివాహమైంది.
రెండు నెలల క్రితం కూతురు పుట్టింది. ఇంకా ఆ పాపనూ అతను చూడలేదు. ఇతను వెళ్లేటప్పటికి గర్భిణిగా ఉన్న భార్య అంజలి ప్రస్తుతం చివరి చూపునకు నోచుకోలేకపోయింది. మూడేళ్ల క్రితం కొయిరాజు తమ్ముడు లక్ష్మయ్య వేటకు వెళ్లినప్పుడు సముద్రంలోనే అనారోగ్యంతో ప్రాణాలొదిలాడు. ఒడ్డుకు తీసుకువచ్చిన తరువాత వీరావల్‌లోనే దహన సంస్కారాలు చేశారు. ఇద్దరు కుమారులను కడసారి చూసుకోలేని విధి రాతను తలచుకొని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
* శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీమత్స్యలేశం గ్రామానికి చెందిన కొయిరాజు పదేళ్లుగా చేపల వేటకు గుజరాత్‌లోని 'వీరావల్' వెళ్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది జనవరిలో గ్రామస్థులతో కలిసి వెళ్లారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరిగి రాలేక తోటి మత్స్యకారులతో అరకొర సౌకర్యాల మధ్య అక్కడే ఉంటున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేసి బోటులోనే నిద్రించారు. ఉదయం ఎంతకూ మేల్కోకపోవడంతో తోటి మత్స్యకారులు పరిశీలించారు. అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు కామయ్య, అప్పలమ్మలు గ్రామంలో కూలి పనిచేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కొడుకు మృతి విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తెలుగు మత్స్యకారులకు రూ.2 వేల సాయం
గుజరాత్‌లో చిక్కుకుపోయిన 6 వేల మంది తెలుగు మత్స్యకారులు ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వారికి వెంటనే సాయం అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సాయం అందేలా చూడాలని చెప్పారు. మత్స్యకారులకు వసతి, భోజన సదుపాయం చూడాలన్నారు. ఇప్పటికే ఈ విషయమై గుజరాత్ సీఎంతో మాట్లాడానని సీఎం వివరించారు.