రెండేళ్ల పాలన పూర్తయినందున వైకాపా కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేసి ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేసిన పనులను వివరిస్తూ.. ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రజల ఆశలను నెరవేర్చారు: సజ్జల
రాష్ట్ర విభజన సహా, కరోనాతో ఆర్థికంగా కష్టాలు వచ్చినా వాటిని అధిగమిస్తూ సీఎం జగన్ సువర్ణ అధ్యాయాన్ని లిఖించారని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.15 ఏళ్లలో జరగని, కలగానే మిగిలిపోయిన ఎన్నో హామీలను రెండేళ్లలో సీఎం జగన్ నెరవేర్చారన్నారు. 5 కోట్ల ప్రజలను తన కుటుంబంగా భావించి వారి సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్నారన్నారు. గుణాత్మక మార్పు తీసుకువస్తారని ప్రజలు పెట్టుకున్న ఆశలను జగన్ నెరవేర్చారన్నారు.
జగన్ లాంటి నాయకులు యుగానికి ఒక్కరు వస్తారనేలా పాలన సాగించారన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థను దేశమంతా చూస్తోందన్నారు. పథకాలను నిరంతర ప్రక్రియగా చేపట్టి అవినీతి అక్రమాలు లేకుండా పారదర్శక పాలన చేస్తున్నారన్నారు. రెండేళ్లలో రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు అనేక పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చి భావితరాల భవిష్యత్తు మార్చాలన్నది సీఎం జగన్ కల అన్నారు. రాష్ట్రంలో 14 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు రేపు శంకుస్థాపన చేస్తారన్నారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో నూతన ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు వైకాపా కార్యకర్తలు, నేతలు పునరంకితమవ్వాలని సూచించారు.
ఇదీ చదవండి:
Jagan Government: జగన్ పాలనకు రెండేళ్లు.. నేడు పుస్తకం ఆవిష్కరించనున్న సీఎం