స్త్రీశక్తి గార్మెంట్స్ మహిళా గ్రూప్... తిరుపతిలోని అతి పెద్ద మహిళా సంఘాల్లో ఒకటి. మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘం.. తిరుపతిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కరోనాను నియంత్రించడంలోనూ ఈ సంఘ సభ్యులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉఫాధి కోల్పోయి... కొన్ని రోజుల పాటు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న వీరు.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు. ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతూనే కరోనా నివారణలో భాగస్వాములవుతున్నామన్న సంతృప్తి పొందుతున్నారు.
స్ర్తీ శక్తి సంఘానికి సంబంధించిన తయారీకేంద్రంలో... 15 నుంచి 20 మంది మహిళలు నేరుగా... మరో 50 మంది ఇళ్ల నుంచి పనుల్లో పాల్గొంటున్నారు. వైద్య అవసరాలకు ఉపయోగపడే విధంగా పీపీఈ కిట్లను రూపొందిస్తున్నారు. కరోనా పాజిటివ్ రోగులకు వైద్యసహాయమందించే వైద్యులు, సిబ్బందికి ఉపయోగపడేలా... ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీటిని తయారుచేస్తున్నారు. కిట్లలో భాగంగా సూట్లు, హెడ్‌క్యాప్, షూకవర్స్, మాస్కులు అందిస్తున్నారు. రోజుకు కనీసం 500 పీపీఈ కిట్లను సిద్ధం చేసి వాటిని నగరపాలక సంస్థ అనుమతులతో వైద్యావసరాలకు అందిస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో... ప్రతి వ్యక్తికీ 3 మాస్కులు అందించే దిశగా... ప్రభుత్వం నుంచి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా... మరో 17 లక్షల మాస్కుల తయారీకి సంబంధించి అవకాశాన్ని పొందింది స్త్రీశక్తి గార్మెంట్స్ సంఘం.
కష్ట కాలంలో కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉంటూనే... కరోనా కట్టడిలో భాగస్వాములవుతున్న మహిళలను నగర ప్రజలు అభినందిస్తున్నారు.
ఇవీ చదవండి: భారత్కు టెస్టింగ్ కిట్లు- 55 దేశాలకు మలేరియా మందు