తిరుపతిలో భార్యకు ఖరీదు కట్టిన శాడిస్టు భర్త - తిరుపతిలో భార్యకు ఖరీదు కట్టిన శాడిస్టు భర్త
ఓ కళాశాలలో అతనో జూనియర్ అసిస్టెంట్. నాలుగు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసిన అతగాడు... వికృత చర్యలకు దిగాడు. వరకట్నం వేధింపుల నుంచి సామాజిక మాధ్యమాల్లో భార్య వ్యక్తిగత ఫొటోలను షేర్ చేసే వరకు వెళ్లాడు. అంతేనా ఏకంగా భార్యను కాల్ గర్ల్‌గా చిత్రీకరించి రాక్షస ఆనందాన్ని పొందాడు. వీటన్నింటిని భరించలేని ఆ ఇల్లాలు.. కుటుంబసభ్యులతో కలిసి భర్త ఇంటిముందు నిరసన చేపట్టింది. మానసిన వేదనకు గురి చేస్తున్న అతడిని అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదని బైఠాయించింది. ఈ ఘటన తిరుపతి నగరంలోని తిమ్మినాయుడు పాళ్యంలో జరిగింది
తిరుపతిలోని తిమ్మినాయుడు పాళ్యంలో భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. కట్నం ఇవ్వలేదనే కారణంతో తన వ్యక్తిగత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపించింది. తనని మోసం చేసిన భర్త రేవంత్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని నిరసన చేపట్టింది.
బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.... స్థానికంగా ఓ కళాశాలలో భర్త రేవంత్ జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 3 రోజుల నుంచే కట్నం డబ్బుల కోసం హింసించడం మొదలుపెట్టాడు. ఇదే విషయమై దిశ పోలీసులను సంప్రదించినా ఫలితం లేదు. ఇక దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి భర్త ఇంటిని ముట్టడించింది.
భార్యపై ఫిర్యాదు...
భార్యను కట్నం కోసం వేధిస్తున్న భర్త రేవంత్.. అలిపిరి పోలీసు స్టేషన్లో ఆమెపై ఎదురు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలను తీసుకుని మాయమైపోయిందంటూ పేర్కొన్నాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని భావించిన భార్య... ఈ మధ్యే పుట్టింటికి వెళ్లిపోయింది.
కాల్ గర్ల్‌గా దుష్ప్రచారం...
భార్య పుట్టింటికి వెళ్లగానే...భర్త రేవంత్ తనలోని వికృత చర్యలను బయటపెట్టాడు. ఏకంగా ఆమె వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం ప్రారంభించాడు. అంతేకాదు కాల్ గర్ల్‌గా చిత్రిస్తూ దుష్ప్రచారానికి తెరలేపాడు. వీటిన్నింటిని భరించలేని భార్య... భర్త రేవంత్ ఇంటి ముందుకు ధర్నాకు దిగింది. తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అతడిని అరెస్ట్ చేసే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదంటూ బైఠాయించింది.
పోలీసుల అదుపులో భర్త రేవంత్
భార్యను వేధిస్తున్న కేసులో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రేవంత్‌ను గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. న్యాయం చేస్తామన్న తిరుపతి అర్బన్ ఎస్పీ హామీతో భార్య ఆందోళన విరమించింది.
ఇదీ చదవండి