veterinary Students : పశువైద్యుల నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ తిరుపతిలోని పశువైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల భవనం పైకి ఎక్కి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1500 మంది పశువైద్య పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీల మేరకు నియామకాలు చేపట్టాలని పశువైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశువైద్యులు నియామకాలు వెంటనే చేపట్టాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పశు వైద్య విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశు వైద్య విద్యార్థులు పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని తిరుపతి, కడప జిల్లా ప్రొద్దుటూరు, కృష్ణాజిల్లా గన్నవరం, విజయనగరం జిల్లా గరివిడి పశు వైద్య కళాశాలలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 900 పశువైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న1217 గ్రామీణ పశు వైద్య కేంద్రాలను పశువైద్యశాలలుగా ఉన్నతీకరించి పశు వైద్యులను నియమించాలని కోరారు. జాతీయ పశు వైద్య మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఐదు వేల పశువులకు ఒక్క పశువైద్య తప్పనిసరిగా ఉండాలని నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: TDP Fires on YSRCP: ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ కొరవడింది: తెదేపా