Vasanthotsavam at TTD: తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. రెండేళ్ల తరువాత భక్తులకు ఈ వేడుకలో పాల్గొనే అవకాశం కలిగింది. మొదటిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. వసంత మండపాన్ని శేషాచలం అడవిని తలపించేలా తితిదే ఉద్యానశాఖ తీర్చిదిద్దింది.
తితిదే, దేవాదాయ శాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం: రాష్ట్రంలోని తితిదే, దేవాదాయ శాఖ భూముల్లో గో ఆధారిత వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని, వారు పండించిన ఉత్పత్తులను తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి కొనుగోలు చేయాలని తితిదే ధర్మప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశం తీర్మానించింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథిగృహంలో గురువారం మండలి సమావేశం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార గ్రామాల్లో ఒక్కో ఆలయానికి రూ.10 లక్షల వ్యయంతో ఏడాదిలోపు 1,072 ఆలయాల నిర్మాణం పూర్తి చేసేలా తీర్మానం చేశారు.
కొవిడ్ పరిస్థితుల నుంచి బయటపడినందున సామూహిక కల్యాణాల నిర్వహణకు పండిత మండలిని ఏర్పాటు చేశారు. ఈనెల 23న కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌లో, మే 8న తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి. మే నెలలో దిల్లీలో, జూన్‌లో హైదరాబాద్‌లో, జూన్ 23 నుంచి జులై 4 వరకు అమెరికాలోని నాలుగు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. గోదావరి జిల్లాల్లో కూడా కల్యాణాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: