గతంలో విక్రయించిన భూముల యజమానులను కబ్జాదారులు గుర్తించి.. వారి వారసుల వద్ద తాజాగా రిజిస్ట్రేషన్‌లు చేయించుకుని ఆ భూమి తమదే అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, వివాదాలు సృష్టించడం, దౌర్జన్యాలు చేయడమే లక్ష్యంగా కొందరు అవతారమెత్తారు. ఈ తరహా వ్యవహారాల్లో కబ్జాదారులు ఇచ్చిందే మహాభాగ్యం అని కొందరు కోట్ల విలువైన భూముల్ని వదులుకుంటుండగా.. మరికొందరు అందినంత రాబట్టుకుని భూములను యజమానులకు అప్పగించేలా సర్దుకుపోతున్నారు. ఇందులో రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసులనూ అనధికారికంగా భాగస్వాములను చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ధీమా కల్పించడంలో విఫలం:
తిరుపతిలో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో వెలుగుచూస్తున్న సెటిల్‌మెంట్ వ్యవహారాల్లో అంతిమ విజయం కబ్జాదారులదే అనేందుకు ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మంగళం-శెట్టిపల్లె మార్గంలో విశ్రాంత ఉద్యోగులు కలిసి 20 ఏళ్ల కిందట స్థలాలు కొనుగోలు చేశారు. ఇది మాదంటూ కబ్జాదారులు చొరపడ్డారు. తిరుపతి చింతల చేను పరిసర ప్రాంతంలో విశ్రాంత ఏఎస్‌ఐ భూమిని కొనుగోలు చేయగా.. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యింది. బాధితులు అధికారుల చుట్టూ తిరిగినా.. న్యాయం జరుగుతుందన్న ధీమా కల్పించడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలం అవుతోందన్న విమర్శలున్నాయి. సమస్యను గుట్టుగా పరిష్కరించేంత వరకు పోలీసులు జోరుగా వ్యవహారాలు జరిపి.. వ్యవహారం బయటపడితే సివిల్ కేసంటూ తప్పించుకుంటున్నారు. అధికారులు స్పందించి భూ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
ఇదీ విజయసింహారెడ్డి వ్యథ:
తిరుపతికి చెందిన విజయసింహారెడ్డి ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ 2012లో ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం ప్రభుత్వం నుంచి అందిన ప్రయోజనాలతో చంద్రగిరి మండలం తొండవాడ గ్రామ లెక్కదాఖలాలోని 128-2బి సర్వే నంబరుకు చెందిన 1.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2013 మార్చిలో ఆయన పేరున రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇచ్చారు. భూమికి సమీపంలో ఆరు వరుసల రోడ్డు రావడం, ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు కావడంతో.. స్థలం విలువ రూ.కోట్లకు చేరంది. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నేత కన్ను దానిపైన పడింది. భూ విక్రయంలో వివాదాలు ఉన్నాయంటూ కంచెను, భూమి వద్ద ఏర్పాటు చేసిన బోర్డును ధ్వంసం చేసి.. పాడుపడిన బావిలో వేయడంతోపాటు బోరు వేయడాన్ని అడ్డుకున్నారు.
బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించడంతో వారు వివరాలు కోరుతూ రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన చంద్రగిరి తహసీల్దారు.. భూమి యజమాని విజయసింహారెడ్డి అని, రిజిస్ట్రేషన్ తేదీ, దస్త్రం నంబరుతో సహా పోలీసులకు సమర్పించారు. అధికార పార్టీ నేత నిత్యం బెదిరింపులకు పాల్పడుతుండటంతో.. బాధితులు న్యాయం కోసం పోరాటం ఆరంభించారు. ‘ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోండి.. లేకపోతే జరిగే అనర్థాలకు మేము బాధ్యులం కాదు’ అంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇది ఒక విజయసింహారెడ్డికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇలాంటి వారు వందలాది మంది బాధితులు తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, తిరుపతి గ్రామీణ మండలాల్లో సెటిల్‌మెంట్ వేధింపులకు గురవుతున్నారు.
ఇదీ చదవండి: