తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం కోయిల్ఆళ్వార్ తిరుమంజనాన్ని అతితక్కువ మందితో పూర్తి చేశామని, ఎక్కడా పది మందికి మించకుండా పాల్గొన్నారని చెప్పారు. ఈసారి ఉగాది ఆస్థానంలో కేవలం 20 మంది కంటే తక్కువే పాల్గొంటారని వివరించారు. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ తర్వాత ఆలయ శుద్ధి చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. బంగారు వాకిలి వద్ద శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహిస్తారని వివరించారు.
మరో 21 రోజుల దర్శనాల రద్దు?
ప్రధాని నరేంద్ర మోదీ మరో 21 రోజుల పాటు లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటి వరకు దర్శనాలను రద్దు చేయాలని తితిదే యోచిస్తోంది. స్వామి వారి కైంకర్యాలు, సేవలను ఏకాంతంగా కొనసాగించనుంది.
ఉగాది వేడుకలకు భక్తులను అనుమతించొద్దు
ఉగాది వేడుకల నేపథ్యంలో ఏ ఆలయంలోకి కూడా భక్తులను అనుమతించొద్దని దేవాదాయశాఖ ఆదేశించింది. ఉగాది కారణంగా బుధవారం భక్తులు వివిధ ఆలయాలకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎవరికీ అనుమతివ్వొద్దని అధికారులు ఆదేశించారు.
ఇదీ చదవండి: