గోవిందుడికి గో ఆధారిత నైవేద్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తితిదే సిద్ధమవుతోంది. ఇప్పటికే గత 45 రోజులుగా సేంద్రియ వ్యవసాయ పంటలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. రోజూ ఇదే విధానాన్ని కొనసాగించేందుకు ధర్మకర్తల మండలి నిర్ణయించింది. రానున్న రోజుల్లో ఈ దిశగా రైతులను సమాయత్తం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లనున్నారు. బ్రిటిష్ పాలనకు ముందు ఈ విధానం అమల్లో ఉండగా ఆ తర్వాత కాలక్రమంలో స్వస్తి పలికారు. ఇప్పుడు మరోమారు తీసుకురావాలని కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగడూరులోని సౌభాగ్య గోశాల, సేవ్ సంస్థ నిర్వాహకులు, ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీనికి తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి సమ్మతి తెలియజేయడంతో ఏప్రిల్ నెలాఖరులో 15 రకాల ప్రకృతి సిద్ధ బియ్యాన్ని తిరుమలకు పంపించారు. దీంతో మే 1వ తేదీ నుంచి శ్రీవారికి వీటితో నైవేద్యం పెడుతూ వస్తున్నారు.
రానున్న రోజుల్లోనూ బియ్యంతో పాటు ప్రసాదాలు, నైవేద్యాలకు ఉపయోగించే దినుసులను సైతం ఇదే విధానం ద్వారా పండించిన వాటి ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోని రైతులను సంసిద్ధం చేయాలని ధర్మకర్తల మండలిలో తీర్మానం చేశారు. ఇందుకోసం తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రకృతి వ్యవసాయవేత్త ఎం.విజయరామ్‌తో పాటు యుగతులసి ఛైర్మన్ కె.శివ కుమార్, వెటర్నరీ వైద్యుడు శివరామకృష్ణ ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు ఒక కార్యాచరణను రూపొందించుకుని రానున్న రోజుల్లో రైతులను కలిసి శ్రీవారికి గో ఆధారిత నైవేద్యం అంశంపై అవగాహన కల్పించనున్నారు.