రాష్ట్ర వ్యాప్తంగా.. తితిదే నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహాలు 'కల్యాణమస్తు' కార్యక్రమంలో.. కరోనా నేపథ్యంలో స్వల్ప మార్పులు చేసినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి ప్రకటించారు. గతంలో జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని... కరోనా తీవ్రత పెరగడంతో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. తిరుపతిలోని తితిదే పరిపాలన భవనంలో కల్యాణమస్తు కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
మే 28న సామూహిక వివాహాలు నిర్వహించడానికి తితిదే నిర్ణయం తీసుకుందని... కరోనా కారణంగా జిల్లా కేంద్రాల్లో కాకుండా నియోజకవర్గాల్లో వివాహాలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఒక్కో జిల్లాలో కనీసం మూడు వందల వివాహాలు చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. ఆయా జిల్లా కలెక్టర్ల సహకారం కోరుతూ... లేఖలు రాయాలని, జంటల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సూచించారు.
వివాహం చేసుకునే జంటలకు రెండు గ్రాముల మంగళసూత్రం, వస్త్రాలు, వెండి మెట్టెలు, పుస్తక ప్రసాదం, శ్రీ పద్మావతి శ్రీనివాసుల ల్యామినేషన్ ఫోటో, భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో జేఈవో సదా భార్గవి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
వారిది అసమర్థ పాలన.. ఇవి అచ్ఛే దిన్ కాదు.. చచ్ఛే దిన్: తులసిరెడ్డి