శ్రీవారి భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదాలను అందించాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తితిదే పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో అన్నప్రసాదం ట్రస్టుపై అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందించే అన్నప్రసాదాల్లో కూరగాయల సంఖ్య పెంచాలన్నారు. మధ్యాహ్నం ఒక రకమైన మెనూ, రాత్రి ఒక రకమైన మెనూ అందించేందుకు వివిధ రకాల కూరగాయలను వినియోగించాలన్నారు. అన్నప్రసాదం ట్రస్టు కింద పనిచేసే సిబ్బందికి డ్రస్‌కోడ్, క్యాప్స్, గ్లౌజ్ అందించాలన్నారు. ముఖ్యంగా వంట మాస్టార్లకు, సర్వింగ్ చేసే సిబ్బందికి అవసరమైన మెళుకువలు నేర్చుకోవడానికి ప్రముఖ సంస్థలతో శిక్షణ అందివ్వాలని సూచించారు. భోజనం వడ్డించేటప్పుడు భక్తులను ఎలా సంభోదించాలి, వడ్డన ఎలా చెయ్యాలి, ఏ విధంగా మెలగాలి అనేది శిక్షణలో భాగంగా ఉండాలన్నారు.
అన్న ప్రసాదాల తయారు చేసే వంటశాల, వడ్డించే హాల్‌లో అవసరమైన ఆధునిక యంత్రాలు, పరికరాలను ట్రస్టు ద్వారా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్నప్రసాదాల తయారీలో వినియోగించే బియ్యం, పప్పు ధాన్యాలు, నూనె, నెయ్యి తదితర ముడిసరుకుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. రాష్ట్రంలోనే గాక దక్షిణాది రాష్ట్రాల్లో జరిగే పుష్కరాలు, ప్రత్యేక ఉత్సావాల్లో భక్తులకు తితిదే అన్నప్రసాదాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి
ISO Certificates: తితిదే ఆధ్వర్యంలోని కళాశాలలకు ఐఎస్వో గుర్తింపు