TTD EO Jawahar Reddy visit children hospital: చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు చేసేందుకు ఆసుపత్రి ప్రారంభించినట్లు తితిదే ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. వసతుల గురించి పిల్లల తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నిరుపేద కుటుంబాల చిన్నారులకు పూర్తిస్థాయిలో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తూ ఆసరాగా నిలుస్తోందని.. గడచిన రెండు నెలలుగా.. 45 మంది చిన్నారులకు శస్త్రచికిత్సల ద్వారా గుండె సంబంధిత సమస్యలను తొలగించినట్లు ఈవో తెలిపారు. 50 శాతానికి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, మిగిలిన కేసులు క్యాథ్ ల్యాబ్ ద్వారా చేసినట్లు ఆయన చెప్పారు.
'శస్త్ర చికిత్సల కోసం 200 మందికి పైగా నమోదు చేసుకొన్నారు. వారానికి 20 చొప్పున సర్జరీలు చేసేందుకు చర్యలు తీసుకొంటున్నాం. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అధునాతన పరికరాలు సమకూర్చనున్నాం' అని ఈవో వెల్లడించారు.
ఎస్వీ బధిర పాఠశాలలోఆకస్మిక తనిఖీలు
Jawahar Reddy visit sv school: తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ బధిర పాఠశాలను ఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు పైచదువుల కోసం ఇతర ప్రాంతాలనకు వెళ్లకుండా డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టే అంశాన్ని తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చిస్తామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన.. వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. ఈమేరకు పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి..
Telangana omicron cases : తెలంగాణలో విస్తరిస్తున్న ఒమిక్రాన్.. మొత్తం కేసులు ఎన్నంటే?