కరోనా ప్రభావంతో తిరుమలపై కూడా ఉందని తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లు పొందిన భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకోరని.. కరోనా ప్రభావంతో గడిచిన నెల రోజుల కాలంలో దాదాపు 30 శాతం మంది శ్రీవారి దర్శన టికెట్లు ఉన్నా.. తిరుమలకు రాలేదని ఈవో వివరించారు. హుండీ, తలనీలాలు, వసతి గృహాలు, లడ్డూ ప్రసాద విక్రయాలు ఇలా వివిధ రూపాల్లో శ్రీవారి ఖజానాకు జమ అయ్యే మొత్తం భారీగా తగ్గిపోయిందన్నారు.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత జూన్ 11 నుంచి జులై 10 వరకు 16.73కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చినట్లు అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా 1.64 లక్షల మంది భక్తులు, కౌంటర్ల ద్వారా 85,434 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని తెలిపారు. టికెట్లు బుక్ చేసుకున్న 30 శాతం మంది తిరుమల యాత్ర రద్దు చేసుకున్నారని చెప్పారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు టెండర్లు నిర్వహిస్తున్నామనీ....పరిస్థితుల దృష్ట్యా బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెల వరకు తితిదేకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేవన్న ఈవో....తలనీలాల విలువ పెరగడంతో 7 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా సమకూరిందని తెలిపారు. ఇప్పటివరకూ 91 మంది తితిదే ఉద్యోగులకు కరోనా సోకినట్లు స్పష్టం చేసిన ఈవో... అలిపిరి వద్ద 1704, తిరుమలలో 1865 మంది తితిదే ఉద్యోగులకు పరీక్షలు చేసినట్లు వివరించారు. తిరుమలకు వచ్చి పరీక్ష చేయించుకున్న ఏ ఒక్క భక్తుడికీ కరోనా సోకలేదని అన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,935 కరోనా కేసులు, 37 మంది మృతి