తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనం టికెట్లు బుక్ చేస్తామని భక్తులను మోసం చేస్తున్న నకిలీ వెబ్‌సైట్‌పై తితిదే విజిలెన్స్ విభాగం తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తిరుపతి మంగళం ఆర్‌టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న రఘు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో ప్రయత్నించగా ttddarshans.com అనే నకిలీ వెబ్‌సైట్ కనిపించింది. రఘు ఈ వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్ల కోసం వివరాలు సమర్పించి ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేశారు. నగదు బదిలీ ప్రక్రియ పూర్తయ్యాక మెయిల్ ఐడీకి దర్శన టికెట్లు పంపుతామని ఈ నకిలీ వెబ్‌సైట్ నిర్వాహకులు నమ్మించారు. ఆ తరువాత దర్శనం టికెట్లు రాకపోవడంతో తాను మోసపోయానని గుర్తించిన రఘు తితిదే అధికారులకు ఫిర్యాదు చేశారు. వెబ్‌సైట్ నకిలీదని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ttddarshans.com అనే వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీవారి భక్తులు దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని తితిదే ప్రకటన విడుదల చేసింది. నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. నకిలీ వెబ్‌సైట్లను సంప్రదించి మోసపోయినట్టు పలువురు భక్తుల నుంచి ఫిర్యాదులు అందటంతో తితిదే నిఘా , భద్రతా విభాగం అధికారులు ఇప్పటికే దాదాపు 20 నకిలీ వెబ్‌సైట్లపై పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేయించి వాటి మీద చర్యలు తీసుకొన్నట్లు ప్రకటనలో వివరించింది.
శ్రీవారి దర్శన టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, గదులను బుక్ చేసుకునేందుకు అధికారికంగా tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ మాత్రమే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించిన సమాచారం కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. ఈ వెబ్‌సైట్లకు సంబంధించిన సమాచారం, ఇతర వివరాల కోసం టీటీడి కాల్ సెంటర్‌ను టోల్‌ఫ్రీ : 18004254141, 1800425333333, ల్యాండ్ లైన్ :0877-2277777, 0877-2233333 నంబర్లను సంప్రదించచాలని తితిదే ప్రకటించింది.