బాహుబలి.. రుద్రమ దేవి వంటి సినిమా పేర్లు వినగానే మదిలో కత్తులు దూయటం, ప్రత్యర్థులతో యుద్ధం చేయటం గుర్తొస్తాయి. అలాంటి కత్తులనే ముద్దు మద్దు మాటలు... బుడి బుడి అడుగులు వేసే చిన్నారులు పట్టేస్తున్నారు. కత్తియుద్ధంలో సత్తా చాటేందుకు సిద్ధమంటున్నారు చిత్తూరు జిల్లా తిరుపతి బుడతలు. కత్తిని తమ చేతికి ఆరో వేలిగా మార్చుకుని ఫెన్సింగ్ (కత్తి యుద్ధం)లో అంచలంచెలుగా ఎదుగుతున్నారు.
కత్తి సాము.. వందళ్ల ఏళ్ల క్రితం నుంచి మన దేశంలో మనుగడలో ఉన్నదే... దాని ఆధునిక రూపమే ఫెన్సింగ్. ఈ క్రీడకు ఆదరణ ప్రస్తుతం అంతంతమాత్రమే. కొంచెం ఖరీదైనది కావటం...పెద్దగా ప్రాచుర్యం లేని కారణంగా చాలా మందికి తెలియదు. ఇలాంటి క్రీడలో చిరుప్రాయంలోనే పతకాల మోత మోగిస్తున్నారు తిరుపతికి చెందిన చిన్నారులు. గత నెల కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ - 10, అండర్ - 12 బాలబాలికల విభాగాల్లో పాల్గొని 9 మంది పతకాలు సాధించారు కత్తివీరులు. ఇప్పుడు జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో.. నేటి నుంచి జరిగే జాతీయస్థాయి పోటీల్లోనూ సత్తా చాటేందుకు... వీరంతా పయనమయ్యారు.
ప్రభుత్వం సహకారం అందించాలి: కోచ్
చిన్న వయస్సులోనే తమని తాము నిరూపించుకోవాలన్న పిల్లల కసితోనే ఈ ఉన్నత ఫలితాలు సాధ్యమయ్యాయని కోచ్ గోపీనాయుడు చెప్పారు. చిన్నారులంతా ఈ క్రీడపట్ల అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారని... ప్రభుత్వం నుంచి కాస్త సహకారమందితే వారిని మరింత సానబెడతానన్నారు.
పతకాల పంట పండిస్తాం..
కోచ్ అందించిన శిక్షణ, తల్లిదండ్రులు ఇస్తున్న ప్రోత్సాహం... తమను ఎప్పటికప్పడు ఉత్తేజపరుస్తోందని చిన్నారులు చెబుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సైతం పతకాల పంటను పండిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక వసతులు ఏమీ లేకున్నా....కేవలం సాధించాలనే కృషి, పట్టుదలతో ఈ చిన్నారులు సాధించిన విజయాలను నగరవాసులు అభినందిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ రాణించాలని కోరుతున్నారు.