తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. సంవత్సరం పొడవునా ఆలయంలో నిర్వహించిన పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. కరోనా నిబంధనల మేరకు ఆలయంలో పవిత్రోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈనెల 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17 సాయంత్రం పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 18న పవిత్ర ప్రతిష్ఠ, 19న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 20న మహాపూర్ణాహుతి చేపట్టనున్నట్లు పండితులు తెలిపారు.
చివరిరోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్నపనతిరుమంజనం, ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో పాల్గొనాలని భావించే భక్తులను వర్చువల్ సేవలో అనుమతించనున్నట్లు తితిదే ప్రకటించింది. సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవిక, కుంకుమ, అక్షింతలు ప్రసాదంగా పోస్టు ద్వారా పంపనున్నారు. వర్చువల్ పద్దతిలో పవిత్రోత్సవాల్లో పాల్గొనాలని భావించే భక్తులు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వర్చువల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈనెల 9 నుంచి బాలాలయం కార్యక్రమం
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 9 నుంచి 13 వరకు బాలాలయం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఆలయ విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు చేపట్టనుండటంతో బాలాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బాలాలయ నిర్వహణలో భాగంగా 8న ఉదయం 10.30 గంటలకు ఆచార్య రుత్విక్ వరణం, సాయంత్రం 6.30 గంటల నుండి మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, వాస్తు హోమం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలను బాలాలయంలోనే నిర్వహిస్తారు. ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ఈనెల 14 నుంచి వచ్చే ఏడాది మే వరకు సాగనున్న నేపథ్యంలో బాలాలయం ఏర్పాటు చేసి భక్తులకు యథావిధిగా మూలమూర్తి దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
'ధన ప్రసాదం' కార్యక్రమానికి శ్రీకారం
శ్రీవారి ధన ప్రసాదం పేరిట తితిదే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును చిల్లర రూపంలో అందిస్తున్నారు. శ్రీవారి హుండీ నాణేలను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదు. దీంతో తితిదే వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతున్నాయి. ఈ చిల్లర నాణేల నిల్వలను తగ్గించేందుకు.. ధన ప్రసాదంగా అందించనున్నారు. అనగా గదుల కోసం డిపాజిట్ చేసిన నగదును తిరిగి భక్తులకు చిల్లర రూపంలో ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి